11-09-2025 08:44:51 PM
సిఐటియు పోలింగ్ కార్యక్రమం విజయవంతం..
స్ట్రక్చర్ సమావేశంలో విధివిధానాలు రూపొందించాలి..
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సొంతింటి కల సాకారం కోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న పోలింగ్ కార్యక్రమానికి కార్మికుల నుండి అనూహ్య స్పందన లభించింది. సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం ఏరియాల లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్ లలో గురు వారం చేపట్టిన కార్మికుల అభిప్రాయ సేకరణ పోలింగ్ కార్యక్రమం ఊహించిన దానికంటే కార్మికుల మద్దతు అదికంగా రావడంతో సిఐటియు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్ కార్యక్రమానికి కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి వారి అభిప్రాయాలను బ్యాలెట్ ద్వారా పొందుపరిచారు. ఈ సందర్భంగా ఏరియాలో చేపట్టిన పోలింగ్ కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పరిశీలించి మాట్లాడారు.
కార్మికుల సొంతింటి కల సాకారం కోసం గత మూడు సంవత్సరాలుగా సిఐటియు ఆధ్వర్యంలో రాజీలేని పోరా టాలు నిర్వహిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం సొంతింటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం, గెలిచిన సంఘాలు కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్న ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కాలనీల పేరిట ఇంటి నిర్మాణాలకు స్థలాలు కేటాయించి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణకే కొంగుబంగారమైన రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఎందుకు వెనకాడుతుందని ఆయన ప్రశ్నించారు.
కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయడం ద్వారా సంస్థకు వేల కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో వేల ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయని, నివాస యోగ్యానికి అనుగుణంగా లేని ఇండ్లను తొలగించి అపార్ట్మెంట్లకు లేదా సొంత ఇంటి నిర్మాణానికి కార్మికులకు 200 గజాల చొప్పున స్థలం మంజూరు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు అమలు చేస్తుందని, ఇదే సందర్భంలో కార్మికులకు హెచ్ఆర్ఏ రూపంలో చెల్లిస్తున్న బకాయిలను ఈఎంఐలుగా మలుచుకుంటే కార్మికుల సొంత ఇంటి కల సులభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే సింగరేణి యాజమాన్యం గుర్తింపు, ప్రతినిధి సంఘాలు స్పందించి సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కల సాకారం అయ్యేవరకు సిఐటియు ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అడుగడుగునా అడ్డంకులు అయినప్పటికీ..
సింగరేణి కార్మికుల సొంత ఇంటి సొంతింటి కల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన పోలింగ్ కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో కలిసి ఆటంకాలు సృష్టించినప్పటికీ కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలింగ్లో పాల్గొనడం పట్ల సిఐటియు నాయకత్వం హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 11 12 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా సొంతింటి కల సహకారం కోసం కార్మికుల అభిప్రాయం సేకరణ కోసం పోలింగ్ నిర్వహిస్తున్నామని సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టగా దానికి అనుగుణంగా గురువారం గనులపై బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటుచేసి కార్మికుల నుండి అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతుండగా గనుల మీదికి సిఐటియు నాయకు లను అనుమతించేది లేదంటూ యజమాన్యం ఏకపక్షంగా సర్కులర్ జారీ చేయడం పట్ల సిఐటియు నాయకులు యజమాన్యం పై తీవ్రంగా మండిపడుతున్నారు.
కార్మికుల సంక్షేమ కోసం కృషి చేయాల్సిన కార్మిక సంఘాలు యాజమాన్యం పంచన చేరి కార్మికులకు ద్రోహం చేయడం సరైనది కాదని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏదేమైనప్పటికీ మెజార్టీ కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలింగ్లో పాల్గొనడం పట్ల సిఐటియు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో సిఐటియు చేపట్టనున్న కార్యక్రమాలకు అండగా నిలవాలని వారు కోరారు సింగరేణి వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ విజయవంతం కావడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్, చైతన్య రెడ్డి, తోపాటు అన్ని ఏరియాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.