calender_icon.png 27 November, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర పరాభవం

27-11-2025 12:00:00 AM

  1. సఫారీల చేతిలో భారత్ సఫా

  2. సొంతగడ్డపై మరో వైట్‌వాష్

కనీస పోటీ కూడా ఇవ్వని వైనం

25 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా

సొంతగడ్డపై ఏ జట్టుకైనా తిరుగుండదు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆతిథ్య జట్లను ఓడించడం అంత సులువు కాదు. భారత్ లాంటి టీమ్‌ను నిలువరించడం అంటే అది చాలా జట్లకు కలగానే మిగిలిన సందర్భాలున్నాయి. భారత్ పిచ్‌లపై అసలు క్రీజులో నిలిచేందుకు కూడా ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టమే.. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి మారింది.. కాదు కాదు సీన్ రివర్సయింది.

ప్రత్యర్థి జట్లకు భారత్ హోం గ్రౌండ్‌లో కనిపిస్తోంది.. గత ఏడాది కివీస్ చేతిలో వైట్‌వాష్ చేయించుకున్న టీమిండియా ఇప్పుడు సఫారీల చేతిలోనూ ఘోరపరాజయం పాలైంది. ఈడెన్ టెస్టులో గెలుపు జోష్‌ను కొనసాగిస్తూ గుహావటిలోనూ సౌతాఫ్రికా భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా టెస్టుల్లో అతిపెద్ద ఓటమిని భారత్ చవిచూడాల్సి వచ్చింది. కనీస పోరాటం కూడా చేయని బ్యాటర్ల వైఫల్యమే ఈ పరాజయానికి కారణంగా చెబుతున్నారు.

గుహావటి, నవంబర్ 26 : భారత క్రికెట్ అభిమానులు ఆశించినట్టు చివరిరోజు అద్భుతాలేమీ జరగలేదు. భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగిన వేళ కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదు. 2 వికెట్లకు 27 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట కొనసాగించిన భారత జట్టు కనీసం రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. సాయి సుదర్శన్ పట్టుదలగా ఆడి నా, జడేజా హాఫ్ సెంచరీ చేసినా ఆ పోరా టం సరిపోలేదు.

అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లలో ఎవ్వరూ క్రీజులో నిలవలేదు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్ త్వరగానే ఔటవగా.. తర్వాత ప్రధాన బ్యాట ర్లు కూడా అదే బాటలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. సౌతాఫ్రికా ఏ జట్టు వరుస సెంచరీలతో అదరగొట్టిన జురెల్(2) ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. పంత్ కూడా 13 పరుగులకే ఔటవగా.. వాషింగ్టన్ సుందర్(16) కాసేపు జడేజాకు సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

ఇక ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లోనూ ఫ్లాప్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. చివరిరో జు భారత్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగిన బ్యా టింగ్ చేసింది మాత్రం సాయి సుదర్శన్, జడేజానే.. సాయి సుదర్శన్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో సఫారీలకు విసుగు తెప్పించాడు. 139 బంతులు ఆడి 14 రన్స్ చేయ గా.. ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జట్టు ను గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. జడేజా 54 (4 ఫోర్లు,2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు.

కాసేపటికే భారత్ 140 పరుగులకు ఆలౌటైంది. సఫారీ స్పిన్నర్ హార్మర్ 6 వికెట్లతో మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. దీంతో సౌతాఫ్రికా 408 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2 కైవసం చేసుకుంది. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. గతంలో 2004లో నాగ్‌పూర్ వేదికగా ఆసీస్‌పై 342 పరుగుల తేడాతో ఓడిపోగా..ఇప్పుడు ఆ చెత్త రికార్డును భారత్ అధిగమించింది. అలాగే సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో భారత బ్యాటర్లు ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోవడం గత 29 ఏళ్లలో ఇదే తొలిసారి.

మరోవైపు భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. చివరిసాగా 1999 సీజన్‌లో సఫారీలు భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలవగా.. ఇప్పుడు బవుమా సారథ్యంలో ఇన్నేళ్లకు మళ్లీ సిరీస్ విజయాన్ని రుచి చూశారు. సౌతాఫ్రికా విజయంలో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన మార్కో యెన్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్, తన స్పిన్ మ్యాజిక్‌తో 17 వికెట్లు తీసిన హార్మర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్కోర్లు 

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 ఆలౌట్ ( ముత్తుసామి 109, జెన్సన్ 93 , స్టబ్స్ 49, వెరెన్నే 45, బవుమా 41 ; కుల్దీప్ యాదవ్ 4/115, బుమ్రా 2/75, జడేజా 2/94, సిరాజ్ 2/106 )

భారత్ తొలి ఇన్నింగ్స్: 201 ఆలౌట్ ( జైస్వాల్ 58, వాషింగ్టన్ సుందర్ 48, రాహుల్ 22; జెన్సన్ 6/48, హార్మర్ 3/64)

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 260/5 డిక్లేర్డ్ ( స్టబ్స్ 94, డీ జోర్జి 49, రికెల్టన్ 35 ; జడేజా 4/62)

భారత్ రెండో ఇన్నింగ్స్: 140 ( జడేజా 54, వాషింగ్టన్ సుందర్ 16 ; హార్మర్ 6/37, కేశవ్ మహారాజ్ 2/37)