27-11-2025 05:27:20 PM
మహిళల ఐపీఎల్ వేలం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(Womens Premier League-2026) మెగా వేలంలో వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్స్ పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. ఊహించినట్టుగానే భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) జాక్ పాట్ కొట్టింది. ఆమెను రూ.3.20 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోవడం దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. దీంతో వేలంలో ఆమెకు భారీగానే ధర పలుకుతుందని అందరూ అంచనా వేశారు. అయితే 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేయగా.. ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.
ఈ దశలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ దీప్తి శర్మ కోసం 3.20 కోట్లతో బిడ్ వేసింది. ఆ ధరను చెల్లించేందుకు యూపీ వారియర్స్ అంగీకరించింది. గత సీజన్ కంటే రూ.60 లక్షలు ఎక్కువ ధరనే ఈ సారి దీప్తి దక్కించుకుంది. గత సీజన్‌లో దీప్తి శర్మకు యూపీ వారియర్స్ 2.60 కోట్లు చెల్లించింది. మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసిన యూపీ ఇప్పుడు ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే తెలుగమ్మాయి శ్రీచరణి కూడా జాక్ పాట్ కొట్టింది. వరల్డ్ కప్ లో అదరగొట్టిన శ్రీచరణి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు శ్రీచరణిని దక్కించుకుంది.
ఇక న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్‌ను గుజరాత్ జెయింట్స్ 2 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ కే చెందిన మరో ప్లేయర్ అమెలియా కేర్‌ను ముంబై ఇండియన్స్ 3 కోట్లకు దక్కించుకుంది. ఇటీవల ప్రపంచకప్ లో రాణించిన భారత పేసర్ రేణుకా సింగ్‌ను గుజరాత్ జెయింట్స్ 60 లక్షలకే కొనుగోలు చేసింది. అలాగే ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్ యూపీ వారియర్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా రిటైన్ చేసుకుంది. ఆమె కోసం యూపీ 85 లక్షలు వెచ్చించింది. మరోవైపు సౌతాఫ్రికా జట్టును ఫైనల్ వరకూ అద్భుతంగా నడిపించిన కెప్టెన్ లారా వొల్వార్ట్‌కు మంచి ధరే దక్కింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ క్రికెటర్ అలీసా హీలీతో మెగా వేలం ప్రారంభం కాగా.. ఆమెను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.