3 May, 2026 | 1:48 AM

ప్రకృతి చెక్కిన అద్భుత లోకం

03-05-2026 12:25 AM
  1. భూగర్భంలో సున్నపురాతి గుహల సౌందర్యం 
  2. దీపపు రాతి స్తంభాల వరుసల్లా శిలలు
  3. మహబూబాబాద్ జిల్లా గణపురంలో అరుదైన రాతి చరిత

అరణ్యాల్లో ప్రకృతి తన కళాత్మకతను ఎలా ప్రదర్శిస్తుందో ప్రత్యక్షంగా చూడాలంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం సున్నపురాతి గుహలను సందర్శించాల్సిందే. బయట నుంచి సాధారణంగా కనిపించే ఈ కొండల గర్భంలోకి అడుగుపెడితే ఒక అద్భుత శిల్పాల ప్రపంచం మన ముందు ఆవిష్కృతమవుతుంది.

ప్రకృతి చేతుల మీదుగా చెక్కిన శిల్పాలు గుహలలోకి ప్రవేశించిన వెంటనే మన కళ్లను కట్టిపడేసేది అక్కడి శిలా ఆకృతు లే. పైకప్పుల నుంచి వేలాడే సున్నపురాయి స్తంభాలు దీపాల వరుసలా కనిపిస్తాయి. నేలపై నుంచి పైకి పెరిగిన శిలలు శివలింగాల్లా, కొన్ని చోట్ల దేవతా విగ్రహాల్లా కనిపిస్తాయి. గుహ గోడలపై జలపాతం గడ్డకట్టినట్టుగా ఏర్పడిన పొరలు, పాములు వంపులు తిరిగినట్టుగా ఉన్న రేఖలు, సింహం, ఏనుగు ఆకృతులను తలపించే శిలలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

ప్రకృతి తనే శిల్పి అయి వేల ఏళ్ల పాటు చెక్కిన కళాఖండాలివి. చుక్కల చినుకులతో పుట్టిన అద్భుతం..ఈ గుహల నిర్మాణం ఒక్కరోజులో ఏర్పడింది కాదు. ప్రతి చుక్క నీరు సున్నపురాయి మీద పడుతూ, కరిగిస్తూ, మళ్లీ గట్టిపడుతూ వేల సంవత్సరాల కాలంలో ఈ ఆకృతులను సృష్టించింది. శాస్త్రవేత్తలు వీటిని ‘స్టలాక్టైట్లు’, ‘స్టలాగ్మైట్లి’గా పేర్కొంటారు. ప్రతి ఆకృతి వెనుక ఒక ప్రకృతి కథ ఉంది. ఒక చుక్క, ఒక శతాబ్దం అలా కోట్ల చుక్కలు కలిసి ఈ గుహలను అద్భుతంగా మలిచాయి.

అంధకార గర్భంలో మర్మమైన అనుభవం

గుహలో లోపలికి వెళ్తే వెలుతురు క్రమంగా కనుమరుగవుతుంది. సన్నని దారులు, అకస్మాత్తుగా తెరుచుకునే పెద్ద గదులు, ప్రతిధ్వనులు వినిపించే గర్భగృహాలు.. ఇవన్నీ కలిపి ఒక మర్మమైన అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని చోట్ల పైనుంచి చొరబడే కాంతి కిరణాలు గుహలోని శిలలపై పడితే అవి వెండి వర్ణంలో మెరిసిపోతాయి. ఆ దృశ్యం చూసినవారిని క్షణం పాటు మాటలేకుండా చేస్తుంది. ఈ గుహలు కేవలం ప్రకృతి అద్భుతాలు మాత్రమే కాదు ఒకప్పుడు మానవ నివాసాలుగా కూడా ఉపయోగించబడి ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. గుహల నిర్మాణం, పరిసర ప్రాంతాల్లో కనిపించే శిలాచిత్రాలు దీనికి ఆధారంగా భావిస్తున్నారు. 

సాహసికులకు స్వర్గం..

అడవుల మధ్యలో ఉన్న ఈ గుహలు ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజం కోసం అద్భుతమైన ప్రదేశం. ప్రతి అడుగు ఒక కొత్త అన్వేషణలా ఉంటుంది. యువతకు ఇది ఒక సాహసయాత్రగా మారుతుంది.

అభివృద్ధి కోసం ఎదురుచూపులు..

ఇంత అద్భుతమైన ప్రదేశం అయినప్పటికీ ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. రహదారులు సరిగా లేవు. గుహలలో లైటింగ్, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల పర్యాటకులు పూర్తి స్థాయిలో అనుభూతి పొందలేకపోతున్నారు. స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఈ గుహలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

భవిష్యత్తులో పర్యాటక హబ్

సరైన ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తే ఈ గుహలు తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశముంది. పర్యాటకులతో పాటు పరిశోధకులకు కూడా ఇది ఒక ముఖ్యమైన అధ్యయన కేంద్రంగా మారవచ్చు. భూమి గర్భంలో ప్రకృతి తన సృజనాత్మకతను ప్రదర్శించిన అద్భుత ఉదాహరణే గణపురం సున్నపురాతి గుహలు. ఇవి కేవలం రాళ్లు కాదు కాలం చెక్కిన కథలు. వాటిని కాపాడటం, ప్రపంచానికి పరిచయం చేయడం మన బాధ్యత.