26 February, 2026 | 2:30 AM

డాక్టర్ కాసుల కక్కుర్తికి యువకుడు బలి

26-02-2026 12:38 AM
  1. అనుభవం లేకున్నా చెవికి ఆపరేషన్
  2. వికటించి మృతి చెందిన యువకుడు
  3. మృతదేహంతో ద్వారక ఆస్పత్రి ఎదుట బంధువుల నిరసన
  4. నిజామాబాద్‌లో ఘటన

నిజామాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): వైద్యుడి కాసుల కక్కుర్తికి యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ నగరంలోని ద్వారక ఆసుపత్రి కి చెవి నొప్పితో వచ్చిన యువకుడికి అనుభవం లేని డాక్టర్ ఆపరేషన్ చేయడంతో వికటించి మృ తిచెందాడు. భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ (22) కు చెవి నొప్పి రావడంతో ద్వారక ఆసుపత్రికి వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం చెవికి ఓ వైద్యుడు ఆపరేషన్ చేసి, అజయ్‌ను పర్యవేక్షణలో ఉంచారు.

కొద్ది గంటల తర్వాత అజయ్ పరిస్థితి విష మించడంతో మరో ఆసుపత్రికి తరలిం చాలని సదరు వైద్యుడు తెలపడంతో బంధువులు డాక్ట ర్ సూచించిన మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అజయ్ మృతి చెందాడు.

నడుచుకుంటూ వచ్చిన తమ కొడుకుని శవంగా మార్చారని ఆగ్రహంతో యువకుడి తల్లిదండ్రులు బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించారు. అనుభవం లేని వైద్యుడు ఆపరేషన్ చేయడం వల్లే అజయ్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ మృత దేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పోలీసులు కేసు  దర్యాప్తు ప్రారంభించారు.