calender_icon.png 22 July, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్ నిష్క్రమణ!

22-07-2025 12:00:00 AM

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి ఊపును ఇచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసి బిక్కచచ్చిన పార్టీకి గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు రావడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి, పంజాబ్‌లో రెండో స్థానానికి కాంగ్రెస్ పరిమితం కావడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గమనించింది.

భవిష్యత్‌ను అంచనా వేసుకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే, తాము ఇంక కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా బ్లాక్’ (ఇండీ)లో ఉండమని, ఆ బ్లాక్ నుంచి వైదొలుగుతున్నామని ఆప్ ప్రకటించింది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఇండియా బ్లాక్  నుంచి ఆప్ నిష్క్రమించడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ. 2024 ఎన్నికలకు మాత్రమే తాము ‘ఇండియా బ్లాక్’తో పొత్తు పెట్టుకున్నామే తప్ప ఎప్పుడూ మిత్రపక్షంగా ఉండాలని కాదని ఆప్ తన నిష్క్రమణను సమర్థించుకుంటున్నది.

‘ఇండియా బ్లాక్’లో నాయకత్వ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పెద్దన్న పాత్ర పోషించలేదని, ఏదైనా రాజకీయ పరిణామంపై ‘బ్లాక్’లోని పార్టీల తో సమావేశం  కావడం గానీ, అనుసరించాల్సిన వ్యూహాలను రచించడం గానీ లేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిందాపూర్వకంగా ప్రకటించారు. నిజానికి కాంగ్రెస్ వ్యతిరేకతతోనే ఆప్ ఏర్పడింది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతి ఆకాశాన్నంటిందని, అవినీతి రహిత పాలన అందించడమే తమ ధ్యేయమంటూ ఆప్ పుట్టుకు వచ్చింది.

అలాంటిది ‘ఇండి యా బ్లాక్’లో  ఆప్  చేరడం మొదటినుంచి ప్రశ్నార్థకంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు వద్దని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినా, ఆ పార్టీ అధిష్ఠానం ఆ వ్యతిరేకతను కాదని ఆప్‌ను మిత్రపక్షంగా చేసుకొంది. అప్పుడు ఏడు సీట్లు దిగ్విజయంగా బీజేపీ సాధించింది. కొద్ది నెలల్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

ఈ తరుణంలో ‘ఇండియా బ్లాక్’ నుంచి ఆప్ వైదొలగడం కాంగ్రెస్‌కు తలనొప్పిగానే పరిణమించింది. బీహార్‌లో ఒంటరిగానే పోటీకి దిగనున్న ఆప్, ఇటు ‘ఇండియా బ్లాక్’ లోని ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఓట్లను అటు ఎన్డీఏ కూటమిలోని పార్టీల ఓట్లను ఎంతవరకు చీలుస్తుందనేది పెద్ద ప్రశ్న. 2027లో గుజరాత్, పంజాబ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు ప్రధాన పార్టీలతో తలపడుతూ తన ఉనికిని ప్రత్యేకంగా నిలుపుకోవాలని ఆప్ భావిస్తున్నది.

గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు సాధించి మరోసారి జాతీ య స్థాయిలో పట్టు సాధించాలనేది ఆప్ వ్యూహం. రానున్న రెండేళ్లలో మంచి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని, తన సొంత మనుగడను పక్కన పెట్టి ‘ఇండియా బ్లాక్’లో కొనసాగడంలో ప్రయోజనం లేదని ఆప్ తలపెట్టింది.2022లో  కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారు తామేనని పంజాబ్ బరిలో దిగిన ఆప్, కాంగ్రెస్‌ను గద్దె దించి దిగ్విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు పొత్తుల పేరుతో పంజాబ్‌ను వదలుకొనేందుకు ఆప్ సి ద్ధంగా లేదనేది స్పష్టమైంది. లోక్‌సభలో ముగ్గురు. రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులున్న ఆప్ ఇప్పుడు ‘ఇండియా బ్లాక్’ నుంచి దూరం కావడం, అనేక  అంశాలపై ప్రభుత్వాన్ని నిలదేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌కు మింగుడుపడని విషయమే. విపక్షాల ఐక్యత ఎప్పుడు మిథ్యగానే ఉంటున్నది.