వరి ధాన్యం కొనుగోలులో వేగవంతం
కోహెడ మార్కెట్ గోదాంను సందర్శించిన కలెక్టర్ హైమావతి
కోహెడ, మే 25: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని రైతులు సంయమనం పాటిస్తూ అధికారులతో సహకరించాలని.. కలెక్టర్ కె. హైమావతి విజ్ఞప్తి చేశారు. సోమవారం వెంకటేశ్వరపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, కోహెడ వ్యవసాయ కమిటీలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో ధాన్యం దిగుమతి ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందన్నారు.
వేగవంతం చేయడానికి మిల్లులకు కాకుండా అందుబాటులో ఉన్న గోదాం లో ప్రస్తుతానికి దిగుమతి చేస్తున్నామని తెలిపారు. గోదాం వద్ద ధాన్యం ట్రాక్టర్ లైన్ చాలా పెద్దదిగా ఉన్నందున ప్రతి ట్రాక్టర్ కి టోకెన్ ఇచ్చి ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా దిగుమతి చేసేలా పనిచేయాలని మార్కెట్ కమిటీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని హమాలీ, లారీల కొరత ఉన్నందున వేగంగా జరగడం కోసం అధికార యంత్రాంగం శాయశక్తిలా పనిచేస్తుందని.. సంయమనం పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.






