25 August, 2026 | 1:42 AM

సూచికలు లేని మలుపులు.. ప్రమాదాలకు పిలుపులు..!

25-08-2026 12:36 AM

గంపలపల్లి, చందారం రూట్‌లో ప్రమాదాలు 

సీఎస్‌ఐ చర్చి మూలమలుపులో ఆటో, బైక్ కెనాల్ లో బోల్తా...

పట్టించుకోని అధికారులు

లక్షేట్టిపేట, ఆగష్టు 24: లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారాయి... ఎలాంటి సూచికలు లేక పోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు గుబురుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

గతంలో మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది గాయపడ్డారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారుల మలుపుల్లో ప్రమాదాలు జరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మచ్చుకు కొన్ని....

గంపలపల్లి నుంచి చందారం వెళ్లే దారిలో లడ్డాఖాన్ గార్డెన్స్ దాటిన తర్వాత చెరువు మూల మలుపు ప్రమాదకరంగా ఉంది. గతంలో ఇక్కడ ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అదే వి ధంగా అందుగుల మల్లన్న గుడి నుంచి చందారం వెళ్లే మూలమలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మూల తిరిగే వరకు వాహనాలు ఎలా వస్తాయో అనే భయం ప్రతి వాహనదారునిలో, పాదచారులలో స్పష్టంగా కనిపిస్తోంది.

రాత్రి సమయాల్లో వాహనదారులు ఈ మూల మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రమాదాలకు గురవుతున్నారు. చందారం నుంచి వెంకట్రావు పేట్ కు వెళ్లే చర్చి దారిలో వచ్చే మూలమలుపు కూడా వంపు తిరిగి ఉండటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా పట్టణంలోని సీఎస్‌ఐ రోడ్డులోని మూలమలుపు వద్ద డిసెంబర్ లో విద్యార్థులను బడికి చేర్చే ఓ ఆటో కెనాల్ లో పడిపోయింది.

ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాల య్యాయి. కొన్ని రోజుల క్రితం ఓ బైక్ కు మూల మలుపు వద్ద పట్టు తప్పి కెనాల్ లో పడిపోయింది. ఇదిలా ఉండగా, మున్సిపాలిటీ పరిధిలోని కరీంనగర్ చౌరస్తా జాతీయ రహదారి 63 వద్ద జరిగే ప్రమాదాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

నిత్యం వేల కొలది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ పలుమార్లు ప్రమాదాలు జరిగిన జాతీయ రహదారుల శాఖ అధికారులు మాత్రం ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదనే విమర్శలున్నాయి.

ఇలా ప్రమాదాలు నివారించవచ్చు....

రోడ్డు మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా వేపుగా పెరిగిన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే ప్రమాదాలను నివారించవచ్చని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సూచిక బోర్డ్ లు ఏర్పాటు చేస్తాం...  కిరణ్, ఏఈఈ, ఆర్ అండ్ బీ

రహదారుల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. పనుల అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. రాత్రి వేళల్లో వాహనదారులకు కనిపించేలా రెడ్ కలర్ రేడియంతో మెరిసేలా రోడ్డు మీద తగిన ఏర్పాటు చేస్తాం. అదే విధంగా వైట్ పెయింటింగ్ కూడా అవసరం అయిన చోట వేసి, ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.