calender_icon.png 22 October, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్ బ్లాక్ గోల్డ్

22-10-2025 01:08:54 AM

టాలీవుడ్ లక్కీ చార్మ్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ సంయుక్త. ఈ అమ్మడు ఇప్పుడు తొలిసారి మహిళా ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగేశ్ కేఎంసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కథానాయకి సంయుక్త సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా సింధు మాగంటి సహ నిర్మాతగా ఉన్నారు.

ఇటీవల ఈ సినిమా టైటిల్ ‘ది బ్లాక్ గోల్డ్’ అని ప్రకటించిన మేకర్స్ దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ సంయుక్త చేతిలో పిస్టల్, టీషర్ట్, చేతులపై రక్తపు మరకలతో రైల్వేఫ్లాట్‌పై కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. శవాల దిబ్బను తలపిస్తున్న రైల్వేస్టేషన్‌లో యాక్షన్ అవతార్‌లో ఉన్న సంయుక్తను చూస్తుంటే, ఆమె ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని రోల్‌లో కనిపించబోతోందని అర్థమవుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: ఏ వసంత్; సంగీతం: సామ్ సీఎస్; పాటలు: రామజోగయ్య శాస్త్రి; యాక్షన్: రామ్‌కృష్ణ; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్; నిర్మాత: రాజేశ్ దండా; కథ, మాటలు: యోగేశ్ కేఎంసీ, ప్రసాద్ నాయుడు; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేశ్ కేఎంసీ.