22-10-2025 06:54:09 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం..
చండూరు (విజయక్రాంతి): కనగల్ మండల పరిధిలోని కురంపల్లి గ్రామంలో ఉన్న ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ నుండి కోటయ్య గూడెం గ్రామంలో ఉన్న మాదన్న, ఊర చెరువులలోకి పైపులైన్ ద్వారా లిఫ్ట్ చేసి కృష్ణా నీటిని నింపాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం అన్నారు. బుధవారం కనగల్ మండల పరిధిలోని కురంపల్లి గ్రామంలో ఉన్న ఎస్ఎల్బీసీ కెనాల్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా గ్రామంలోని మాదన్న చెరువు, ఊర చెరువు ఈ రెండు చెరువులు వర్షాలు పడ్డప్పుడు మాత్రమే నిండుతాయని ఆయన అన్నారు. ఈ రెండు చెరువుల నింపాలని కోరుతూ ఈనెల 17న మునుగోడు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వారి ఆదేశానుసారం అధికారులు ఈ కెనాల్ ను పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.
వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఈ రెండు చెరువులు నిండుతాయని మిగతా సమయాల్లో వర్షాలు లేనప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో మా గ్రామ రైతులు ఊరు వదిలిపెట్టి వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కురంపల్లి నుండి మిషన్ భగీరథ పైపులైన్ మాదన్న చెరువు వరకు 250 ఎంఎం పైపులైను ఖాళీగానే ఉందని దీనికి 100 హెచ్ పి మోటార్ వేసి లిఫ్ట్ చేసి నింపితే చుట్టుపక్కల నాలుగు గ్రామాలైన కోటయ్య గూడెం, ఉడతలపల్లి, పడమటితాళ్ల, దుబ్బగూడెం గ్రామాలకు 2000 ఎకరాల నుండి 3000 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రఘు, మాజీ సర్పంచులు కావలి ఆంజనేయులు, మేకల యాదయ్య, మేకల వెంకన్న, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.