calender_icon.png 3 May, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడగాలులపై కార్యాచరణ

03-05-2025 02:47:33 AM

  1. 588 మండలాలు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు 
  2. అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాట్లు
  3. హీట్‌వేవ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు, వడగాలులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నుం చి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ మేరకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండి యన్ మెట్రాలాజికల్ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్  రూపొందించాయని, ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు ఓ నోడల్ అధి కారిని నియమించారని తెలిపారు. వడగాలులపై కార్యాచరణ ప్రణాళిక  -2025 విడుదల సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల దృష్ట్యా చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని, సీఎస్‌ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ లోని 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాం తాలుగా గుర్తించినట్టు చెప్పారు. వడగాల్పుల మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియా ను రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచినట్టు మం త్రి పొంగులేటి గుర్తుచేశారు. అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజ లు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.

వేడి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి, కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతినిచ్చేలా రొటేషన్ పద్ధతిని అవలంబించేలా పరిశ్రమలకు సూచించాలని సూచించారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సదుపాయం కల్పించాలని కార్మిక సంక్షేమ శాఖకు సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్థ నా స్థలాల వంటి పబ్లిక్ ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు.

ముఖ్యంగా పార్కుల వద్ద పక్షులు, వీధి జంతువుల కోసం నీటి సరఫరాను సమకూర్చాలని చెప్పారు. ప్రజలకు క్లోరినేట్ చేసిన తాగునీటిని సరఫరా చేయాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణాశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్,  ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.