calender_icon.png 4 May, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ప్రాజెక్టులను.. రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది

03-05-2025 01:56:59 PM

హైదరాబాద్: నాడు పాలమూరు ప్రాజెక్టులను(Palamuru projects) ఏండ్ల తరబడి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కాంగ్రెస్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) అన్నారు.  రూ. 4,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి.. వలసల జిల్లా పాలమూరుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి దక్కుతోందని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం పూర్తయిందన్న హరీష్ రావు ట్రయల్ రన్ కూడా పూర్తయింది నీళ్లు కూడా బయటకు వచ్చాయని చెప్పారు.

కేవలం ప్యాకేజీ 3 కింద నాలుగైదు కిలోమీటర్ల మేర రాళ్లను తొలగించి కాల్వ పూర్తి చేస్తే పాలమూరు జిల్లాకు ఈ వానాకాలం 50 టీఎంసీల నీళ్లు వచ్చేవని వెల్లడించారు. ఏడాదిన్నర కాలంలో మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ తవ్వే సామర్థ్యం ఈ కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేక, నీళ్లు వాడక 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పిర్రని మండిపడ్డారు. కేసీఆర్ కి ఎక్కడ పేరు వస్తుందోనని ఏడాదిన్నర కాలంగా ప్రాజెక్టును పడావు పెట్టి ఇప్పుడు మళ్ళీ రెండేళ్లు పడుతుందని నిన్న ఉత్తమ్ అంటున్నారని విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి అన్యాయం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ సర్వే(Pranahita-Chevella Project Survey), మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట 2,600 కోట్లు పందికొక్కులా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుందన్నారు. కాళేశ్వరమే కూలితే.. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు మంచి నీళ్లు ఎట్లా తెస్తావ్ రేవంతూ? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పదేండ్ల పాలనలో సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధిపై విమర్శలు చేసేవారికి, వాస్తవాలు తెలిసి కూడా మొద్దు నిద్ర నటించే వారికి విశ్రాంత ఇంజనీర్ శ్రీధర్ దేశ్ పాండే రాసిన పుస్తకాలు మేలుకొలుపు అన్నారు. కేసీఆర్ పదేండ్లలో సాధించిన ప్రగతికి తార్కాణమని పేర్కొన్నారు. మేధావులు, సామాజిక వేత్తలు, తెలంగాణ వాదులు, రాజకీయ నాయకులు, యువ ఇంజినీర్లు, విద్యార్థులు, పాఠకులకు ఈ పుస్తకాలు కరదీపిక లాంటివని ఆయన స్పష్టం చేశారు.