calender_icon.png 16 August, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రి డ్రగ్స్ పరిశ్రమపై చర్య తీసుకోవాలి

16-08-2025 12:09:39 PM

  1. వ్యర్థ జలాలు వదలడంతో పంటలకు తీరని నష్టం
  2. పరిశ్రమ ముందు రైతుల నిరసన 
  3. కంపెనీ మూసివేయాలని డిమాండ్ 
  4. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమణ

గుమ్మడిదల: వర్షం నీటితో పంట పొలాలకు బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమ(Maithri Drugs Industry) వ్యర్ధ జలాలను వదులుతున్నారని పలుమార్లు పరిశ్రమ యాజమాన్యానికి మొరపెట్టుకున్నప్పటికీ వినడం లేదని శుక్రవారం కురిసిన వర్షానికి వ్యర్థ జలాలను విచ్చలవిడిగా వదిలిపెట్టడంతో గుమ్మడిదల గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహించి పరిశ్రమ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ ప్రధాన కార్యాలయంకు వెళ్లి ఎండితో మా పంట చేలలోకి వ్యర్థ జలాలు వచ్చి పంట పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. రాతపూర్వకంగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటు రాత్రి కురిసిన వర్షానికి వ్యర్ధ జలాలను వదలారని ఆగ్రహిస్తూ పరిశ్రమను మూసివేయాలని పరిశ్రమ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి కలుగజేసుకొని పరిశ్రమ లోపలికి వెళ్దామనుకున్న రైతులకు నచ్చజెప్పి పరిశ్రమ లోపలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రైతులు పరిశ్రమ ముందు నిరసనను కొనసాగించారు. అనంతరం వ్యర్ధ జలాలు వదిలిపెడుతున్న పైపు గొట్టాల వద్దకు పోలీసులతో తహసిల్దార్ పరమేశం రైతులతో కలిసి వెళ్లి పరిశీలించి అట్టి వ్యర్ధ జలాలను శాంపిల్ సేకరణ చేసి సంబంధిత శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు పంపిస్తామని చెప్పారు. అందులో ఏమైనా రసాయన వ్యర్ధ జలాలు వర్షం నీటితో కలిపి వదిలినట్లయితే పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. దీంతో రైతులు నిరసన విరమించి మళ్లీ పునరావృతం అవుతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతామని పరిశ్రమ యాజమాన్యాన్ని రైతులు హెచ్చరించారు.