30-07-2025 11:43:59 PM
జేరిపోతుల జనార్ధన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిద్దిపేట..
బెజ్జంకి: ఫీజుల విషయంలో విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ అకారణంగా విద్యార్థులను కొడుతున్న సెయింట్ జోసెఫ్ స్కూల్(St. Joseph's School) యాజమాన్యంపై విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని, ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ ముందు సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేసి అనంతరం మండల విద్యాధికారి కార్యాలయంలో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్ స్కూల్ పాఠశాలలో నిబంధనలు విరుద్ధంగా విద్యార్థులను టీచర్లు ఇష్టారీతిలో కొడుతున్నారని, ఈ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న షైనీ ప్రసస్త అనే విద్యార్థినిని ఫీజుల కోసం వేధించడమే కాకుండా ఇనుప స్కేల్ తో తీవ్రంగా కుట్టడం జరిగిందని ఆ విద్యార్థినికి ముఖానికి గాయాలయ్యాయని, ఇదే విషయమై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.. మండల విద్యాధికారికి ఈ విషయాన్ని చెప్పగా విద్యాధికారి స్కూలుకు వచ్చి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అని అన్నారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి తీవ్రంగా కొట్టిన స్కూల్ టీచర్ పై పాఠశాల ప్రిన్సిపాల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, సిపిఐ నాయకులు మిట్టపల్లి సుధాకర్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు మహేష్ విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నారు.