calender_icon.png 14 May, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూకంలో ఇబ్బంది కలిగిస్తే చర్యలు

14-05-2025 12:00:00 AM

- రబీలో జిల్లాలో 400  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

- జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా 

- జిల్లాలో 36192 మంది రైతులకు రూ.181 కోట్ల డబ్బులు జమ 

- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, మే 13(విజయక్రాంతి):వరి ధాన్యం కొనుగోలు తూకం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు.

మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నశంకరంపేట్ మండలం గవ్వలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, వాయుపుత్ర రైస్ మిల్లుకు సంబంధించిన గోదాంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు  వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు.

తూకం విషయంలో పారదర్శకత అవసరమని, ఎటువంటి అవకతవకలు జరిగిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లాలో 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 36,192 మంది రైతులకు గాను 181 కోట్ల రూపాయలు రైతుల ఎకౌంట్లో  సకాలంలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. 71 మిల్లులకు ధాన్యం ఎగుమతి చేస్తున్నామని, ధాన్యం అన్లోడింగ్ విషయంలో సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ శాఖ ద్వారా ఒక అధికారిని నియమించి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యానికి స్థలం సరిపోకపోతే 13,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన కొన్ని గోడౌన్స్ లీజుకు తీసుకొని అందులో నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట తహసిల్దార్ మన్నన్ , కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు.