23-01-2026 12:03:40 AM
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి
సిద్దిపేట జనవరి 22 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనంలో టమాటా పప్పుతో పాటు మరిగించిన చారు పోయడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాటించకపోతే చర్య లు తప్పవని పాఠశాల ప్రధానోపాధ్యాయుని హెచ్చరించారు కుకునూ రుపల్లి మండల పరిధిలోని లకుడారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక అమలును జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.మధ్యాహ్న భోజనంలో టమాటా పప్పు, మరిగించిన చారు వంటకాలను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెనూ పాటించకుండా పిల్లలకు చారు పెడతారా? అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆమె, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.అనంతరం పదవ తరగతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. చదువు ఎలా చెబుతున్నారు? భోజనం ఎలా ఉంటుంది? నిన్న ఏమి తిన్నారు? అని ప్రశ్నించారు.
చదువు బాగానే చెబుతున్నారని, నిన్న పప్పుచారు, గుడ్డు తిన్నామని విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. తెలుగు పిరియడ్ సందర్భంగా పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి రచయిత పద్యాలను బిగ్గరగా చదివితే త్వరగా కంఠస్థమవుతాయని, వాటి భావాలను మరియు రచయితల జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. పుస్తకంలోని అన్ని పద్యాలను చదవడం, రాయడం నేర్చుకోవాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయమని, సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, సబ్జెక్ట్ జ్ఞానాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.