calender_icon.png 23 January, 2026 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజనుల చైతన్యంతోనే సుపరిపాలన సాధ్యం: మడత వెంకట్ గౌడ్

23-01-2026 10:54:51 AM

ఇల్లందు, (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని ఏక్తా హౌస్‌లో  బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల బహుజనుల నాయకులతో రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ ప్రతిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల్లో చైతన్యం వచ్చినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకతీతంగా నిలబడే బహుజనులను కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని, చదువు, అర్హత, ప్రశ్నించే తత్వం, అభివృద్ధి ఆలోచన, కలుపుకుపోయే గుణం, సమస్యలపై స్పందించే ఆరాటం ఉన్న నాయకులకే ఓటు వేయాలన్నారు. గతంలో తమ పాలనలో ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.120 కోట్ల నిధులు సాధించి అభివృద్ధి పరుగులు పెట్టించామని, ఆ పనులను ప్రజలు నాడు–నేడు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు డబ్బుల ప్రలోభాలు చూపించినా అవి ప్రజల సొమ్మేనని, డబ్బులు తీసుకున్నప్పటికీ అభివృద్ధి చేసే, పరిపాలన పరంగా ప్రశ్నించే తత్వం ఉన్న నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనన్నారు.

ఈ నెల 23 నుంచి 26 వరకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది వార్డుల చొప్పున బహుజనుల చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యావంతులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, సమాజ సేవకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బహుజనులు పోటీలో నిలబడితే అగ్రవర్ణాలు సహించలేక నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈసారి బహుజనులు భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలకు తక్కువగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు వస్తాయన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

మడత రమా వెంకట్ గౌడ్ నాయకత్వంలో గతంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ అదే నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దసరా, వినాయక చవితి వంటి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ఇల్లందు కీర్తిని పెంచామని తెలిపారు. కౌన్సిలర్ అంటే జవాబుదారితనంతో ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నంగా ఉండాలని, కౌన్సిల్ సమావేశాలకు హాజరైనప్పుడే గౌరవ వేతనం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వార్డుల్లో సమస్యలు పేరుకుపోతే కౌన్సిలర్‌తో పాటు పాలకవర్గాన్ని ప్రజలు నిలదీసే హక్కు ఉందన్నారు. ఈ సమావేశంలో ముద్రగడ వంశీ, సాల్మన్ రాజ్, కోటగిరి రాజేందర్, భరత్, బాణాల శ్రీనివాస్, మామిడి శివ, గార్ల సంపత్, విక్కీ, విన్ను, గోపి, గార్ల రమేష్, బండి సతీష్, బాబా, మున్నాఫ్, చరణ్, నరేష్, బి.ఎన్. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.