23-01-2026 01:34:58 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు
హరీశ్‌రావు తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సిట్ నోటీసులు
నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 22 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావును మంగళవారం సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కే తారకరామారావుకు నోటీసులు జారీచేసింది. గురువారం కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉండటంతో.. పోలీసులు నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి గోడకు నోటీసులు అతికించారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీచేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.
నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం పోలీస్‌స్టేషన్‌లో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టంచేశారు. కేటీఆర్ విచారణకు సహకరిస్తారని బీఆర్‌ఎస్ పార్టీ అడ్వొకేట్ సోమ భరత్ స్పష్టంచేశారు. చట్టాన్ని గౌరవిస్తూ శుక్రవారం ఉదయం కేటీఆర్ విచారణకు హాజరవుతారని చెప్పారు. ఈ కేసులో చట్టబద్ధంగానే న్యాయపోరాటం చేస్తాం అన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు మంగళవారం సుమారు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఆ విచారణలో నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, శ్రవణ్ రావులతో ఉన్న సంబంధాలు, ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే హరీశ్‌రావు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని సమాచారం. ఆ విచారణలో వచ్చిన కొన్ని అంశాల ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రమేయం ఈ వ్యవహారంలో ఉందనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది.