23-01-2026 01:32:40 AM
అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం
* బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసింది. బోర్డు కేవలం నామమాత్రంగా మారింది. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయి. రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సీఎస్‌ఆర్ నిధులను సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వారి నియోజకవర్గాలకే నిధులు మళ్లించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతున్నది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : సింగరేణి విషయంలో సహక రించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణం అంశంలో సీబీఐ చేత విచారణ చేయించాలని బీఆర్‌ఎస్ నేత లు పదే పదే డిమాండ్ చేయడం హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణలోకి సీబీ ఐ రాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి నిషేధించారని, ఇప్పుడు మళ్లీ సీబీఐ విచారణ వేయాలని కోరుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
సింగరేణి విషయం లో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదన్నారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి అనేది కార్మికులు, ప్రజల ఆస్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగా ణ సీఎం కోరితేనే సీబీఐ విచారణ జరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధ్దిలో కీలకంగా ఉన్న సింగరేణి టెండర్లలో కొత్త కొత్త నిబంధనలు పెట్టి అదనపు భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు.
ఒక వేళ కొత్త నిబంధనలు పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుం దన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సింగరేణిలో దోపిడి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతుందన్నారు. ఈ 12 ఏళ్లలో రూ. 47 వేల కోట్లను కార్మికులకు ఇవ్వాల్సి ఉందన్నారు. ‘సింగరేణి 8 జిల్లాల్లో విస్తరించి ఉండగా, దీనికి 136 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. గతంలో బొగ్గు ఉత్పత్తిలో అనేక రికార్డులు సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయం లో రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు.
ఆ సమయంలో నేను కూడా తెలంగాణ పోరుయాత్రలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటించాను. లాభాల్లో ఉన్న సింగరేణి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా సమస్యల్లో చిక్కుకుంది. ఈ సంస్థలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు. సింగ రేణి బోర్డులో 10 మంది డైరెక్టర్లు ఉంటారు.. వారిలో రాష్ట్రం నుంచి ఏడుగురు, కేంద్రం నుంచి ముగ్గురు ఉంటారు. అన్ని నిర్ణయాలు బోర్డు పరిధిలోనే తీసుకుంటారు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేసీఆర్ కుటుంబం ఆదేశాలే..
ఈ అంశాలన్నింటినీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించాం. అప్పట్లో నైనీ కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజ మాయిషీ చేసింది. బోర్డు కేవలం నామమాత్రంగా మారింది. టెండర్ల నుంచి చిన్న కాం ట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయి. రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సీఎస్‌ఆర్ నిధులను సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వారి నియోజకవర్గాలకే నిధులు మళ్లించారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల అభివృద్ధి, వైద్య శిబిరాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రూ. 1,500 కోట్ల నిధులు ఇప్పటికీ సంబంధిత జిల్లాలకు ఇవ్వలేదు. నిధుల కొరత కారణంగా సింగరేణిలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టలేకపోతున్నారు. పాత యంత్రాలతో పనిచేయడం వల్ల కార్మికులపై అదనపు భారం పడుతోంది’ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
సింగరేణి ఇంచార్జ్ ఎండీలతోనే కాలం..
ప్రస్తుతం సింగరేణిలో సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగించారని కిషన్‌రెడ్డి తెలిపారు. కానీ ఎవరెక్కడ పనిచేస్తున్నారో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయ లేదన్నారు. ‘బోర్డు సమావేశాల్లో మేము డిస్సెంట్ నోటీసులు ఇచ్చినా, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో నిర్ణయాలు మాకు చెప్పలేదు.
సీఎండీ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ, నాలుగేళ్ల పరిమితి ఉన్నవారిని ఐదేళ్ల వరకు కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్‌చార్జ్ సీఎండీలతోనే కాలం గడుపు తూ, ఫుల్ టైం సీఎండీలను నియమించడం లేదు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
50 శాతం బొగ్గు టీజీ జెన్కోకు సరఫరా అవుతోంది..
‘సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో సుమారు 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీజీ జెన్కోకు సరఫరా అవుతోంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా బకాయిలు చెల్లించకుండా, సింగరేణిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తోంది. దీంతో 8 జిల్లాల ప్రజల జీవనాధారమైన సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ఏ కుటుంబానికి చెందిన ఆస్తి కాదు.
ఇది సింగరేణి కార్మికుల రక్తం, చెమటతో నిర్మితమైన సంస్థ. సింగరేణిపై పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడితే చరిత్ర క్షమించని హెచ్చరిస్తున్నాం. గత యూపీఏ హయాంలో భారీ బొగ్గు కుంభకోణాలు జరిగాయి. దీంతో సుప్రీంకోర్టు 216 కోల్ బ్లాక్‌ను రద్దు చేసింది. కోల్ బ్లాక్ జాతీయ ఆస్తి అని, అవి తెల్లకాగితాలపై కాకుండా, వేలం పద్ధతిలోనే కేటాయించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆ ఆదేశాల ప్రకారం 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కోల్ బ్లాక్ ఆక్షన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్క కోల్ బ్లాక్లో కూడా చిన్న తప్పిదం జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2025 నాటికి 1 బిలియన్ టన్నుల రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దేశంలో బొగ్గు కొరత లేదు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో 74 శాతం బొగ్గు ఆధారంగానే వస్తోంది’ అని వివరించారు.
సింగరేణి బొగ్గుకు ధర ఎక్కువ..
‘నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్, సింగరేణి -రెండింట్లోనూ ఉత్పత్తి స్వభావం దాదా పు ఒకేలా ఉంటుంది. కానీ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.1,736 ఖర్చు అయితే, సింగరేణిలో మాత్రం రూ. 2,878 ఖర్చవుతోంది. అంటే 66 శాతం ఎక్కువ ఖర్చు సింగరేణిలోనే జరుగుతోంది. సింగరేణిలో జీ 11 గ్రేడ్ బొగ్గు అమ్మక ధర టన్నుకు రూ.4,088. అదే జీ 11 గ్రేడ్ బొగ్గును వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో రూ.2,491కే విక్రయిస్తోంది. కోలిండియాలో కూడా ఇదే గ్రేడ్ బొగ్గును తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
అయితే సింగరేణిలో అసలు ఖర్చు లు ఎంత అవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ స్పష్టంగా వెల్లడించలేదు. బొగ్గు వెలికితీత, రవాణాకు సంబంధించిన టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పు డు విధానంతో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను చేర్చారు. దీంతో పారదర్శకత కు భంగం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోల్ బ్లాక్‌కు వేలం నిర్వహించకుండా కేం ద్రానికి అప్పగిస్తే పారదర్శకంగా ఆక్షన్ నిర్వహించి సింగరేణికి అప్పగించేందుకు సిద్ధం గా ఉంది’ అని కిషన్‌రెడ్డి వివరించారు.
17 కంపెనీలు విజిట్ చేసినా సర్టిఫికెట్ ఇవ్వలేదు..
‘నైనీ కోల్ బ్లాక్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయి. జనవరి 29 వరకు టెండర్ ప్రక్రియకు గడువు ఉంది. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో కూడా టెండర్లు పిలిచి, ఆఫర్లు వచ్చిన తర్వాత మధ్యలోనే రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం నైని కోల్ బ్లాక్ను క్యాప్టివ్ మైన్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది. సహజంగా ఆ మైనింగ్ పనులు సింగరేణితోనే చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా మేము చేయలేము అని సింగరేణితో లేఖ రాయించి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసింది.
టెండర్లలో సాధారణంగా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ సెల్ఫ్ డిక్లరేషన్ రూపం లో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. 17 కంపెనీలు విజిట్ చేసినా ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. తాడిచెర్ల కోల్ బ్లాక్ విషయంలోనూ ఇదే జరిగింది. ఉమ్మడి ఏపీ కాలంలో సింగరేణికి కేటాయించిన బ్లాక్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. ఉమ్మడి ఏపీలో రోశయ్య ప్రభుత్వం హయాంలో తాడిచెర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణితో బలవంతంగా లేఖ రాయిం చి, ఆ కోల్ బ్లాక్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి సింగరేణిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేశాయి. దీని ఫలితంగా సింగరేణి సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. కొన్ని సందర్భాల్లో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది’ అని విమర్శించారు.