23-01-2026 01:39:48 AM
సింగరేణి బొగ్గు టెండర్‌పై భగ్గుమన్న కిషన్‌రెడ్డి!
సింగరేణిని, అందులోని 40 వేల మంది ఉద్యోగులు, కార్మికులను కాపాడేలా కేంద్రం స్పందించాలని ‘విజయక్రాంతి’ తన కథనాల్లో ఉద్ఘాటించింది. టెండర్ స్కాంపై ఆగ్రహించిన కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి వివాదం మరింత ముదరక ముందే బాధ్యతాయుతంగా స్పందించి లోతైన విచారణకు ఆదేశించారు.
నైనీ టెండర్‌లో గోల్‌మాల్ తేల్చేందుకు..
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): తెలంగాణకు కొంగుబంగారమై న సింగరేణి సంస్థలో తాజాగా తీవ్ర వివాదాస్పదమైన నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖా మంత్రి జీ కిషన్‌రెడ్డి భగ్గుమన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్.. బడా నేతలు, మీడియా సంస్థల మధ్య ప్రత్యక్ష వివాదంగా మారి న నేపథ్యంలో.. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ టెండర్‌ను రద్దుచేసి.. కొత్తగా రూపొందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనితో ప్రతిపక్ష పార్టీల నేతలు హరీశ్‌రావు, బీజేపీ నేత లు ఈ భాగోతంపై లోతుగా విచారించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కను సన్నల్లో జరిగిన టెండర్ స్కాంతోపాటు.. సింగరేణికి రూ. 5,000 కోట్ల నష్టం వాటిల్లేలా టెండర్లను రూపొందించడంలో తెరవెనుక ఉన్నవారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం స్పందించాలనికూడా విజ్ఞప్తి చేశారు. దీనితో కేంద్ర బొగ్గు శాఖా మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఈ టెండర్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసిన ఆయన.. అక్రమార్కులను, వారికి సహకరించినవారిని, అధికారులను ఉపేక్షించేది లేదంటూ తేల్చిచెప్పారు.
దీనితోపాటు.. సాంకేతికంగా టెండర్లలో ఏం జరిగింది, ఎలా జరిగింది, నిబంధనలను ఎలా మర్చారు.. ఎవరు మార్చారు.. అసలు టెండర్లను ఎందుకు రద్దు చేయాల్సివచ్చింది.. తెరవెనుక ఎవరు ఉన్నారనే అంశాలతోపాటు.. వాస్తవంగా బొగ్గు కంపెనీల్లో మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) విషయంలో నిబంధనలు ఎలా ఉన్నాయి.. సింగరేణిలో ఎలా జరిగాయి అనేది తేల్చాలంటూ ఇద్దరు ఉన్నతాధికారులతోకూడిన సాంకేతిక బృందాన్ని నియమిస్తూ.. మూడు రోజుల్లో మొత్తం పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీచేశారు. దీనితో బుధవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి జారీఅయ్యాయి.
ఇద్దరు టెక్నికల్ సభ్యులు..
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేత్న శుక్లా, అలాగే డైరెక్టర్ (టెక్నికల్) మారపల్లి వెంకటేశ్వర్లును ఈ టెక్నికల్ కమిటీలో సభ్యులుగా నియమించారు. సింగరేణి హెడ్‌క్వార్టర్‌ను ఈ ఇరువురు సభ్యుల బృందం తక్షణం సందర్శించి 28.11.2025 నాడు జారీచేసిన నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (ఎన్‌ఐటీ)ను లోతుగా పరిశీలించి నిజానిజాలను తేల్చాలంటూ ఆదేశించారు.
అలాగే టెండర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే కారణాలను కూడా గుర్తించాలని ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనితోపాటు ఇతర బొగ్గు కంపెనీల్లో మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) టెండర్ల విషయంలో ఎలాంటి నిబంధనలను అనుసరిస్తున్నారు.. అక్కడికి.. సింగరేణి జారీచేసిన టెండర్లకు తేడా ఏమిటనేది గుర్తించాలని.. టెక్నికల్ కమిటీ బృందాన్ని ఆదేశించారు.
లోతుగా విశ్లేషించిన ‘విజయక్రాంతి’ కథనాలు..
ఇదిలా ఉండగా.. సింగరేణి టెండర్లలో లోగుట్టుపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో వరుసగా విశ్లేషిస్తూ కథనాలు ప్రచురణ అయ్యాయి. వాస్తవానికి మొదట్లో మీడియా సంస్థల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా.. అటుతరువాత.. రాజకీయ నేతల మధ్య అంతర్గత పోరులా సింగరేణి టెండర్లపై ఇతర మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే టెండ ర్ల విషయంలో చాలా వాస్తవాలను, లోతైన అంశాలను పక్కనపెట్టారు. ‘విజయక్రాంతి’ దినపత్రికలో అసలు టెండర్ల గోల్‌మాల్‌లో లోతైన అంశాలను పేర్కొంటూ.. ఎక్కడెక్కడ ఎలా జరిగిందనేది తెలిసేలా కథనాలు వచ్చాయి.
ప్రిక్వాలిఫికేషన్ నిబంధనలను ఎలా మార్చారు.. అధికారులు, నేతల పాత్రపై అనుమానాలు.. సింగరేణికి రూ. 5,000 కోట్లు నష్టం ఎలా వాటిల్లే అవకాశం ఉంది.. తెర వెనుక శక్తులు ఎవరుండే అవకాశం ఉందనే అంశాలను సృశిస్తూ.. వరుసగా కథనాలను ప్రచురించింది. ఇవన్నీ.. కేంద్ర బొగ్గు శాఖా మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి వెళ్ళాయి. అలాగే ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కార్యక్రమానికి రూ. 100 కోట్ల సింగరేణి నిధులను ఖర్చుపెట్టడం.. తెరవెనుక జరిగిన తతంగం.. ఇందులో సింగరేణికి ఎలాంటి పేరు రాలేదు. కనీసం సింగరేణి సీఎండీ, డైరెక్టర్లుకూడా పాల్గొనలేదు.
పోనీ సింగరేణిలో 49 శాతం వాటాదారైన కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా పాల్గొన్నారా అంటే అదీలేదు. కేవలం సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత కార్యక్రమంలా సింగరేణి నిధులు రూ. 100 కోట్లతో నిర్వహించారు. దీనిపై మొదటి నుంచి ప్రజల్లోనూ, ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దీనిపైనా ‘విజయక్రాంతి’ కథనాలను వెలువరించింది. ఇవన్నీ కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళడంతో.. ఈ రెండు అంశాలపైనా లోతుగా పరిశీలించేలా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
ఈ వివాదాలు మరింత పెరగకముందే.. తప్పులను సరిదిద్ది.. సింగరేణిని, అందులోని 40 వేల మంది ఉద్యోగులు, కార్మికులను కాపాడేలా కేంద్రం స్పందించాల్సిన అవసరాన్నికూడా ‘విజయక్రాంతి’ తన కథనాల్లో ఉద్ఘాటించింది. దీనితో వివాదం మరింత ముదరకముందే బాధ్యతాయుతంగా కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి స్పందించి లోతైన విచారణకు ఆదేశించారు. ఇక అటు టెండర్లలో గోల్‌మాల్‌కు.. ఇటు సింగరేణి సీఎస్‌ఆర్ నిధుల ఖర్చులో ‘చేతి’వాటానికి ఒకే విచారణతో ఫుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు.
దీనితో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులందరూ బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పైగా కేవలం మూడు రోజుల్లో నివేదిక అందించాలని స్పష్టంగా చెప్పడం ద్వారా కేంద్రం ఈ అంశాలపై, వివాదాలపై సీరియస్‌గా ఉందని చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతోంది. మూడు రోజుల తరువాత నివేదికలో ఏం ఉంటుంది?.. తరువాత ఏం జరుగుతుందనేది చూడాలి..!
సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుపైనా దృష్టి..
ఇదిలా ఉండగా.. టెండర్ నిబంధనల విషయంలో వచ్చిన ఆరోపణలు, టెండర్ లో ఉన్న అంశాలతోపాటు.. సింగరేణిలో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను నిబంధనల ప్రకారమే ఖర్చు చేస్తున్నారా అనేది పరిశీలించాలనికూడా ప్రత్యేకంగా అదులో పేర్కొన్నారు. దీనితో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ పర్యలన కు ఖర్చుచేసిన రూ. 100 కోట్లపై కేంద్రం దృష్టి సారించినట్టుగా చెప్పవచ్చు. ఇందు లో సింగరేణి ఎంత ఖర్చు చేసింది.. ఎలా ఖర్చు చేసింది.. నిబంధనల ప్రకారమే అం తా జరిగిందా.. లోపాలు ఏం ఉన్నాయి అనే కోణంలో అధికారుల బృందం లోతుగా పరిశీలించేలా ఆదేశాలు జారీచేయడంతో సింగరేణిలోని ఉన్నతాధికారులు, వారి వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో వణుకు మొదలయ్యింది.
ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. ఆదేశాల వెనుక రెండు లక్ష్యాలు కనపడుతున్నాయి. ఒకటి సింగరేణి టెండర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించడం.. టెండర్ల నిబంధనలను రూపొందించడంలో వెనకున్న శక్తులను కనుగొనడం, వారిపై చర్యలు తీసుకోవడం ఒకటైతే.. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ పర్యటనకు సింగరేణి నిధులను ఖర్చు చేయడం వెనకున్న అసలు మతలబును తేల్చడం. ఈ రెండు అంశాలను ఒకే టెక్నికల్ బృందంతో లోతుగా పరిశీలించేలా ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చారు.
దీనితో ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అన్న చందంగా రెండు వివాదాస్పదమైన అంశాలపై నిజానిజాలు బయటకు రానున్నాయి. ఈ రెండు అంశాల వెనుక ఉన్న అసలైన వ్యక్తులు, శక్తులను బయటకు తీయడానికి అవకాశం చిక్కింది. అలాగే ఈ రెండు అంశాలుకూడా సింగరేణితో ముడిపడి ఉండటంతో.. సింగరేణిని కాపాడే ప్రయత్నం చేయడం ద్వారా ప్రజలు, సింగరేణి కార్మికుల్లో భరోసా కల్పించేలా చర్యలు తీసుకున్నారు.
రోజుకో మలుపు తీసుకుంటున్న సింగరేణి టెండర్ల వ్యవహారంలో.. బొగ్గు శాఖా మంత్రిగా సరైన సమయంలో స్పందించి.. విచారణకు టెక్నికల్ కమిటీని నియమించడం ద్వారా.. అవినీతిపై రాజీ పడే ఆస్కారం లేదని తేల్చి చెప్పినట్టయ్యింది. పైగా తన సొంత శాఖ పరిధిలోని సింగరేణిపై వస్తున్న ఆరోపణలపై మంత్రిగా తక్షణం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.