calender_icon.png 23 January, 2026 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీల్లో నోకోర్స్!

23-01-2026 01:00:24 AM

  1. కెమికల్, టెక్స్‌టైల్, మైనింగ్, ఫార్మాస్యూటికల్ కోర్సులు రద్దు
  2. డిమాండ్‌లేని సీట్లకు ప్రముఖ విద్యాసంస్థల స్వస్తి
  3. ఆయా సీట్ల స్థానాల్లో కొత్త కోర్సులు
  4. ఏఐ నేపథ్యంలో ‘కంప్యూటర్’ సీట్లకు యమ డిమాండ్ 
  5. ఈ విద్యాసంవత్సరానికి కనీసం రెండు వేల సీట్లు పెంచాలని కేంద్రానికి ఐఐటీల ప్రతిపాదనలు

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లోనే కాదు... దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లోనూ ఏ కోర్సు పడితే ఆ కోర్సుల్లో చేరేందు కు విద్యార్థులు ఇష్టపడటంలేదు. అది ఐఐటీ ఢిల్లీ అయినా లేదా బాంబే, మద్రాస్ ఏదైనా సరే..! డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే చేరేందుకే ఇష్టపడుతున్నారు.

కోర్ బ్రాంచ్ సీట్లకు అక్కడ ఆదరణ కరువైంది. డిమాండ్‌లేని కోర్ బ్రాం చ్‌ల్లో చేరకపోవడంతో ఆయా సీట్లను ఖాళీగా ఉంచుకోలేక వాటిని ఐఐటీలు రద్దు చేసుకుంటున్నాయి.పైగా ఆయా సీట్ల స్థానాల్లో డిమాం డ్ ఉన్న కొత్త కోర్సులను తీసుకొస్తున్నాయి.

ఈ కోర్సులకు నో డిమాండ్

ఐఐటీల్లో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకు చెందిన బీటెక్ సీట్లు రద్దు చేసుకుంటున్నాయి. కొన్ని ఐఐటీలలో టెక్స్‌టైల్, మైనింగ్, కెమికల్, మెటలార్జీ మెటీరియల్స్, ఫార్మాస్యూటికల్స్, ఎరో స్పేస్ వంటి బ్రాంచ్‌లలోని సీట్లకు పెద్దగా ఆదరణలేకపోవడంతో ఆయా సీట్లను రద్దు చేసుకుంటున్నాయి. ఐఐటీ ఢిల్లీ, ఖరగ్‌పూర్, రూర్కీ, బాంబే, మద్రాస్ లాంటివి సైతం డిమాండ్‌లేని కోర్ బ్రాంచ్ సీట్లను తగ్గించుకుంటున్నాయి. 2014-16లో ఐఐటీల్లోని కొన్ని కోర్ బ్రాంచ్ సీట్లు నిండకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

దీంతో ఆ కమిటీ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడని, డిమాండ్ లేని కోర్సులను రద్దు చేయాలని ఆ కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ డేటా సైన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులకు మార్చుకుని సీట్లను పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో మొత్తం 18,160 సీట్లు ఉన్నా యి.

అయితే ఐఐటీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2026 -27 విద్యాసంవత్సరంలో కనీసం 2 వేల సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి ఐఐటీలు ఇటీవల విజ్ఞప్తి చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం లో వస్తున్న మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిమాండ్‌లో భాగంగా కోర్సుల నాణ్యతను కూడా పెంచాలని కోరా యి. గత మూడునాలుగేళ్లుగా ఏఐకి డిమాండ్ పెరగడంతో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు యమ డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా పీజీ కోర్సుల్లో డేటా సైన్స్, ఏఐఎంఎల్, ఎంబీడెడ్ సిస్టమ్స్, మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్ తదితర కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.

ర్యాంకింగ్ తగ్గుతుందని..

ఐఐటీల్లో చదివితే చాలూ మంచి ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలుంటాయి. కానీ భవి ష్యత్‌లో డిమాండ్ ఉన్న కోర్సులనే విద్యార్థు లు ఎంచుకోవడంతో కోర్ బ్రాంచ్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. దీనిప్రభావం జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌పైన పడుతుంది. దీంతో ఖాళీగా ఉన్న సీట్లను వేరే వాటికి మార్చుకుంటున్నాయి. ఇప్పటికే మన దేశంలోని 23 ఐఐటీలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్‌లో వందలోపు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. 

ఐఐటీ బాంబేలో...

గత ఐదేళ్లలో కొన్ని కోర్సుల్లోని సీట్ల వివరాలు

* ఐఐటీ బాంబేలో 2020 నాటికి కెమికల్ బ్రాంచ్‌లో 167 సీట్లుంటే 2025 వరకు 124కు తగ్గాయి.

* మెటలార్జికల్ మెటీరియల్స్ బ్రాంచ్‌లో 123 సీట్లకు 105 సీట్లే ఉన్నాయి.

* ఎరోస్పేస్‌లో 89 సీట్లకు 72 సీట్లే ఉన్నాయి.

ఐఐటీ ఢిల్లీలో...

* కెమికల్‌లో 82 సీట్లకు 75 సీట్లే ఉన్నాయి.

* టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సుల్లో 116కు 85 సీట్లున్నాయి.

* ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీయల్‌లో 89కు 83 ఉన్నాయి.

ఐఐటీ రూర్కీలో...

* పాలిమర్ సైన్స్‌లో 40 సీట్లకు సున్నా ఉన్నాయి.

* మెటలార్జికల్ మెటీరియల్స్‌లో 68కి 54 మాత్రమే.

ఐఐటీ మద్రాస్‌లో...

* కెమికల్‌లో 117కు 111 సీట్లు ఉన్నాయి.

* మెటలార్జికల్ మెటీరియల్స్‌లో 68కి 54 ఉన్నాయి.

ఐఐటీ వారణాసిలో...

* ఫార్మాస్యూటికల్‌లో 80కి 75 ఉన్నాయి.

* మైనింగ్‌లో 131కి 120 ఉన్నాయి.