21-05-2025 11:27:41 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
నిజాంసాగర్ (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం రోజు డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామంలో రాచేశ్వర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు(MLA Thota Lakshmi Kanta Rao)తో పాటు డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పాల్గొన్నారు. ముందుగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ... జుక్కల్ నియోజకవర్గానికి పదిహేనేళ్లుగా పట్టిన గ్రహణం వీడిందని, అసమర్థ నాయకుడి పాలనలో ప్రజలు అరిగోసలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదిహేనేళ్లుగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవకపోయినా.. కష్ట కాలంలో కూడా పార్టీ జెండా విడవకుండా, బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు ఎదుర్కుంటూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించడమే గాక,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో భాగం అయినందుకు జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ పేద వాడికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఎవ్వరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువకులకు ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని, ప్రతిపక్షాల దుష్ప్రచారాలను, కుట్రలను తిప్పి కొట్టాలని క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యువజన విభాగ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.