22-05-2025 01:04:49 AM
మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో దద్దరిల్లిన అబుజ్‌మడ్
మరో ౨౬ మంది కూడా..
గెరిల్లా యుద్ధవ్యూహాలు రచించడంలో దిట్ట
గర్వంగా ఉంది
భద్రతా బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా.. మావోయిజం ముప్పు ను నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉంది.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ
మైలురాయి విజయం
నక్సలిజం నిర్మూలన లో ఇదొక మైలు రాయి విజయం. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఆపరే షన్‌లో మరణించారు.
హోంమంత్రి అమిత్‌షా
దండకారణ్యం రక్తమోడింది.. నిషేధిత మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మడ్ బటైల్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాళ్ల కేశవరావు సహా ౨౭ మంది మరణించారు. గత కొన్ని నెలలుగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో చేపట్టిన నక్సల్ వ్యతిరేక పోరులో ఇది కీలక పరిణామం.
ఈ ఎన్‌కౌంటర్‌లో 30మంది వరకు మావోయిస్టులు మృతిచెందినట్లు భావిస్తున్నారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ.. భద్రతా బలగాలు అద్భుత విజయం సాధించాయన్నారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు(70) అలియాస్ బసవరాజు మృతిచెందినట్లు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు.
2018, నవంబర్‌లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. మూడు దశాబ్దాల విప్లవపోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎదురుకాల్పుల్లో చనిపోవడం ఇదే తొలిసారి. మృతుల్లో నంబాళ్లతో పాటు మధు (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్రనేత), నవీన్ తదితర అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం.
బీజాపూర్/చర్ల, మే 21: ఛత్తీస్‌గఢ్‌లోని మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం ఉదయం భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో వెం టనే స్పందించిన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.
బస్తర్‌లోని నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ నాలుగు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. అబుజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్‌కుమార్ ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామగ్రి లభించినట్లు చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఒక డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్)కు చెందిన జవాన్ కూడా మృతిచెందినట్లు తెలిపారు.
మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ..
కేశవరావు అలియాస్ బసవరాజు మరణం భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్)కి పెద్ద ఎదురుదెబ్బ అని తెలుగు రాష్ట్రాల నిఘా అధికారులు చెబుతున్నారు. ఆయన నిషేధిత మావోయిస్ట్ పార్టీకి ఉత్తర, దక్షిణ కమాండ్‌ల మధ్య సంధానకర్తగా ఉన్నారు. గణపతి లేదా ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేశవరావు ఆయన స్థానంలోకి వచ్చారు.
గణపతి లాగానే పార్టీని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి కేశవరావు కృషి చేశారు. ఆయన ఒక రోజు పశ్చిమ బెంగాల్‌లో, మరో రోజు శ్రీకాకుళంలో ఉంటారని, పార్టీ కోసమే ఆయన నిత్యం పనిచేసేవారని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ‘కేశవరావు మావోయిస్టులకు సైద్ధాంతిక నాయకుడు మాత్రమే కాదు. వారి పోరాట నాయకుడు కూడా. చాలా చిన్న వయస్సు నుంచే పార్టీలో ఉన్నారు.
ఆయన మరణం వారికి పెద్ద దెబ్బ. కేశవరావులాగా మావోయిస్టులను ఏకతాటిపైకి తీసుకురాగల వ్యక్తి ప్రస్తుతం ఎవరూ లేరు. ఆయన లేకుండా మావోయిస్టులు తిరిగి సంఘటితం కావడం దాదాపు అసాధ్యం’ అని చెప్పారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ నుంచి కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడం, పాత తరం అంతా మరణి స్తుండటంతో నిషేధిత మావోయిస్టు సంస్థ మనుగడ సాగించడం కష్టం అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఘన విజయంపై గర్వంగా ఉంది
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదిక స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా.. మా వోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ
నక్సలిజం నిర్మూలనలో మైలురాయి: హోంమంత్రి అమిత్‌షా
‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయి స్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే తొలిసారి.
భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో 54మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది’ అని అమిత్‌షా ఎక్స్‌లో పేర్కొన్నారు.
లొంగిపోవాలని విజ్ఞప్తులు ఉండవు
ఈ ఆపరేషన్ మూడు రోజులుగా కొనసా గుతోంది. సైనికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నా..మేం మొదటి నుంచి లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక విజ్ఞప్తులు చేయాల్సిన అవసరం లేదు.
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి
ఆపరేషన్ 50గంటలు కొనసాగింది: ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ
బీజాపూర్, నారాయణపూర్ ఉమ్మడి ప్రాంతంలో గత 50 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఒక సైనికుడు గాయపడ్డాడు. మరొక సైనికుడు అమరుడయ్యాడు. మావోయిస్టులపై ఘన విజయం సాధించిన భద్రతా బలగాలకు అభినందనలు.