calender_icon.png 22 May, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు

22-05-2025 01:10:16 AM

బీజాపూర్/చర్ల, మే 21: మిలటరీ దాడుల వ్యూహకర్తగా నంబాళ్లకు పేరుంది. మిలటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకత. దశాబ్దకాలం పాటు కేంద్ర మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమలులో మరింత కఠినంగా వ్యవహరించేవారని చెబుతుంటారు.

దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మేవారని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం. గెరిల్లా యుద్ధతంత్రంలో నేర్పరి అయిన కేశవరావు మల్లో జుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి దాడులకు వ్యూహరచన చేసేవారు. మావోయిస్టు పార్టీలో మిలటరీ కమిషన్ ఏర్పాటు చేసింది ఈయనే. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో అబూజ్‌మడ్ రాజధానిగా చేసుకుని విప్లవ కారిడార్‌ను నేపాల్ వరకు విస్తరించిన నాయకత్వంలో కీలకపాత్ర పోషించారు. 

నంబాళ్లకు ఎన్నో మారుపేర్లు..

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావుకు ఎన్నో మారుపేర్లు ఉన్నాయి. బసవరాజు, గంగన్న, ప్రకాశ్, బీఆర్,  క్రిష్ణ, వినయ్, ఉమేశ్, రాజు, విజయ్, దారపు నరసింహరెడ్డి, నరసింహ, కేశవ్ అనే పేర్లతో ఆయన్ను పిలిచేవారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు. ఆయన తండ్రి వాసుదే వరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

ఎంటెక్ మధ్యలోనే ఆపేసి..

కేశవరావు ప్రాథమిక విద్య సొంతూరులోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివిన కేశవరావు..డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా వరంగల్‌లో ఆర్‌ఈసీ(రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల)లో బీటెక్ సీటు రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యా రు. ఆర్‌ఈసీలో బీటెక్  చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు.

1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు.  పీపుల్స్‌వార్ పార్టీ ఆవిర్భావంలో కేశవరావుది కీలకపాత్ర. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఉద్యమంలో చేరిన తర్వాత ఎన్నడూ స్వగ్రామానికి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

నక్సలైట్ ఇంజినీర్..

నంబాళ్ల కేశవరావుకు మావోయిస్టుల్లో నక్సలైట్ ఇంజినీర్ అనే పేరుంది. ఎంటెక్ చదివిన నంబాళ్ల బాంబులు తయారీ చేయడంలో దిట్ట. ఆకస్మిక దాడులు చేయడంలో నిపుణులు. కేశవరావు ఎప్పుడూ తన వెంట ఏకే 47 రైఫిల్ ఉంచుకునేవారు. కేశవరావు 1987లో బస్తర్ అడవుల్లో ఎల్‌టీటీఈ శిబిరంలో శిక్షణ పొందారు.

అలిపిరి దాడి ప్రధాన సూత్రధారి..

2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనలో ప్రధాన సూత్రధారి నంబాళ్ల కేశవరావే. క్లుమైర్ మైన్స్ దాడి ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. అలాగే 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం నంబాళ్లదే. గస్తీకి వెళ్లి తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు రెండు కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు.

ఈ ఘటనలో 76మంది జవాన్లు మృతిచెందారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాప కుడు మహేంద్రకర్మపై దాడి వ్యూ హం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రకర్మతో పాటు మరో 27మంది మరణిం చారు. విశాఖ జిల్లాలో కిడారి సర్వేశ్వరరావు హత్య, 27మంది కాంగ్రెస్ నేతల హత్య, సీలేరు నదిలో లాంచీపై దాడి చేసి గ్రేహౌండ్స్ బలగాలను హతమార్చిన ఘటనలోనూ కేశవరావు హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ నక్సల్..

నంబాళ్ల కేశవరావు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ నక్సల్‌గా ఉన్నారు. ఎన్‌ఐఏ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ దళాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. నంబాళ్లపై రూ.1.5కోట్ల రివార్డు సైతం ప్రకటించారు.