బ్యాంక్ రుణ వితరణ తగ్గుతుంది

29-04-2024 12:27:34 AM

ఎస్ అండ్ పీ అంచనా

ముంబై, ఏప్రిల్ 28: రానున్న నెలల్లో బ్యాంక్‌లు రుణ వితరణను తగ్గిస్తాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. రుణ డిమాండ్ పెరిగినంత స్పీడ్‌గా డిపాజిట్లు వృద్ధిచెందకపోవడమే ఇందుకు కారణమని వివరించింది. 2023 16 శాతంగా ఉన్న రుణ వృద్ధి ప్రస్తుత 2024 14 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ నికితా ఆనంద్ చెప్పారు.

డిపాజిట్ల వృద్ధి, ప్రత్యేకించి రిటైల్ డిపాజిట్లు మందకొడిగా ఉన్నాయని, దీంతో ప్రతీ బ్యాంక్‌లోనూ లోన్ టు డిపాజిట్ రేషియో క్షీణిస్తున్నదని తెలిపారు. డిపాజిట్ల వృద్ధికంటే రుణాల వృద్ధి 23 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నదన్నారు. ఈ కారణంగా బ్యాంకులు వాటి రుణ వితరణ వేగాన్ని  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి కి అనుగుణంగా తగ్గించుకుంటాయన్నారు. బ్యాంక్‌లు ఆ పనిచేయనట్టయితే హోల్‌సేల్ ఫండింగ్‌కు అధిక వడ్డీ రేట్లను చెల్లించాల్సి వస్తుందని, దీంతో బ్యాంకుల లాభదాయకత క్షీణిస్తుందని ఆనంద్ వివరించారు.