1 July, 2026 | 10:00 AM

హిండెన్‌బర్గ్ నష్టాల నుంచి కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్

25-05-2024 01:48 AM

న్యూఢిల్లీ, మే 24: గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎట్టకేలకు యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ నష్టాల నుంచి కోలుకున్నది. ఇందుకు దాదాపు ఎడాదిన్నర సమయం పట్టింది. అదానీ గ్రూప్ పలు మార్కెట్ అవకతవకలకు పాల్పడిందని, ఆఫ్‌షోర్ షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు మళ్లించి షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచివేసిందంటూ హిండెన్‌బర్గ్ గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తిప్పికొట్టినప్పటికీ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత గ్రూప్ షేర్లన్నీ నిలువునా పతనమయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీలు 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను (రూ.12.5 లక్షల కోట్లు) కోల్పోయాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడే ముందు 2023 జనవరి 24న రూ.3,442 వద్ద ముగిసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు అటుతర్వాత రూ.1,500 స్థాయికి పతనమయ్యింది. మళ్లీ అదే స్థాయికి ఈ మే 24న చేరుకుని, నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్నది. శుక్రవారం ఇంట్రాడేలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 3,457 స్థాయికి చేరింది. 

ఏడు రోజుల్లో 70 శాతం పతనం

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత కేవలం ఏడు రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 70 శాతం విలువను కోల్పోయింది. ఇదే రీతిలో ఇతర గ్రూప్ షేర్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అంబూజా సిమెంట్, ఏసీసీ, ఎన్డీటీవీ తదితరాలన్నీ భారీ పతనాన్ని చవిచూశాయి. గత ఏడాది మే నెలల్లో అబుధాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ (ఐహెచ్‌సీ), యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్ పెట్టుబడులు చేయడంతో అదానీ గ్రూప్ రికవరీ ప్రారంభమయ్యింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు జరపడం, సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం తదితర ఉదంతాల్లో హిండెన్‌బర్గ్ ఆరోపణలు రుజువుకాకపోవడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరుకు మద్దతు లభించింది. 

పలు గ్రూప్ షేర్లు ఇంకా దిగువస్థాయిలోనే..

హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు ముందు స్థాయిలకు చేరిన అదానీ గ్రూప్ షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ నాల్గవది. అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ షేర్లు ఇప్పటికే రిపోర్ట్  ముందునాటి స్థాయిల్ని మించిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అదానీ పోర్ట్స్ చేరనున్నదనే వార్తలతో గురువారం ఈ షేరు 8 శాతం ర్యాలీ జరిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఇంకా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ముందునాటి ముగింపు స్థాయిలకంటే తక్కువగానే ఉన్నాయి. ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు అంబూజా సిమెంట్, ఏసీసీ, ఎన్డీటీవీలు కూడా అప్పటిస్థాయికంటే దిగువనే కొనసాగుతున్నాయి.