క్షీణించిన ఎన్టీపీసీ నికరలాభం
న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ నికరలాభం ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో 2 శాతం క్షీణించి రూ. 5,556 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 5,672 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఎన్టీపీసీ ఆదాయం మాత్రం 3% వృద్ధిచెంది రూ. 41,317 కోట్ల నుంచి రూ. 42,532 కోట్లకు పెరిగింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.3.25 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలు పంచిన మధ్యంతర డివిడెండ్లు (మొత్తం రూ.4.5)కు అదనంగా తుది డివిడెండును చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.
అణు విద్యుత్ కోసం సబ్సిడరీ
అణు విద్యుత్ వ్యాపారాన్ని చేపట్టేందుకు ప్రత్యేకంగా ఒక సబ్సిడరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎన్టీపీసీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇందుకు కేంద్ర విద్యుత్ శాఖ, దీపమ్, నీతి ఆయోగ్‌లు అనుమతించాల్సి ఉన్నది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక యూనిట్ సగటు టారీఫ్ రూ.4.89 నుంచి రూ.4.61కు తగ్గింది. నాల్గవ త్రైమాసికంలో ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి 89.66 బిలియన్ యూనిట్ల నుంచి 93.387 బిలియన్ యూనిట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 344.27 బిలియన్ యూనిట్ల నుంచి 361.70 బిలియన్ యూనిట్లకు ఎగిసింది. క్యూ4లో బొగ్గు ఉత్పత్తి 6.48 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 7.87 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరగ్గా, పూర్తి ఏడాదిలో 20.23 ఎంఎంటీ నుంచి 27.7 ఎంఎంటీలకు చేరింది. క్యూ4లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 80.32 శాతం నుంచి 79.77 శాతానికి తగ్గగా, పూర్తి ఏడాదిలో 75.90 శాతం నుంచి 77.25 శాతానికి పెరిగింది. 2024 మార్చి 31నాటికి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 75,958 మెగావాట్లుగా ఉన్నది.






