27-07-2025 05:00:22 PM
ములుగు (విజయక్రాంతి): గ్రామ పాలన అధికారులు(జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్.మహేందర్ జి(Additional Collector Revenue Mahenderji) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 27 మంది అభ్యర్థులకు గాను, 26 మంది హాజరయ్యారని, 1 మంది గైర్హాజరు అయినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 80 మంది అభ్యర్థులకు గాను 71 మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు. లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు సెకండ్ సెషన్ లో జరిగే ప్లాటింగ్ పరీక్షకు పరీక్షకు 80మంది అభ్యర్థులకు గాను 71మంది హాజరయ్యారని, 09 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ఎలాంటి కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించిన అదనపు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఓ.రాజ్ కుమార్,ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.