27-07-2025 06:47:44 PM
అట్టహాసంగా మహిళా ఇందిరా శక్తి సంబరాలు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మహిళల ఆర్థిక సామాజిక, అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్. పి. గార్డెన్స్ లో ఆదివారం మహిళా శక్తి సంబరాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ... మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారని, వాటితో పాటు కార్డులో సభ్యుల చేర్పుల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. మీ -సేవా కేంద్రాల ద్వారా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పాత రేషన్ కార్డులలో పేర్లు కలిగి ఉండి, వివాహం అనంతరం నూతన రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ముందు తమ పాత రేషన్ కార్డులో వివరాలు తొలగించుకోవాలని తెలిపారు. వివరాల తొలగింపు అనంతరం నూతన రేషన్ కార్డు దరఖాస్తులను ఆర్.ఐ., తహసిల్దార్, జిల్లా పౌరసరఫరాల శాఖ స్థాయిలలో పరిశీలించి మంజూరు కొరకు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు..
బెల్లంపల్లి మండలంలో 1 వేయి 509 నూతన రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని, 2 వేల 806 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్పించడం జరిగిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక రేషన్ కార్డు నుండి ఒక విద్యుత్ కనెక్షన్ కు మాత్రమే పథకం వర్తిస్తుందని తెలిపారు. రూ. 500 రాయితీ సిలిండర్ పథకంలో ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
రూ.25 కోట్ల రుణాలు..
ప్రభుత్వం మహిళా సాధికారతకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బెల్లంపల్లిలో రూ.25 కోట్ల స్వయం సహాయక సంఘాలకు అందించడం జరిగిందని, 2024- 25 సంవత్సరానికి గాను రూ.6.76 కోట్లవడ్డీ లేని రుణాలు, రుణభీమా పథకంలో13 మందికి రూ.30.17 లక్షల ప్రమాద భీమా క్రింద 4 మందికి రూ.40 లక్షల అందించడం జరిగిందని తెలిపారు. స్త్రీ నిధి పథకంలో రూ.16.49 కోట్ల లక్ష్యం కాగా రూ.6.8 కోట్ల రుణాలు సాధించడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకంలో బెల్లంపల్లిలోని 47 వేల 500 మంది రైతుల ఖాతాలను రూ.70 కోట్లు జమ చేయడం జరిగిందని తెలిపారు. గృహ జ్యోతి పథకంలో 32 వేల 891 యూనిట్లు అందించడం జరిగిందని, మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు పథకం కొరకు రూ.300 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, 4 వేల 565 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయం చెక్కులు, రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, గౌడ కులస్తులకు కాటమయ్య రక్షా ఫీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తహసిల్దార్ కృష్ణ, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరీ రామచందర్, కాంగ్రెస్ నాయకులు కంకటి శ్రీనివాస్, నర్సింగరావు రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.