01-01-2026 01:05:23 AM
జగిత్యాల, డిసెంబరు 31 (విజయ క్రాంతి): ఈ నెల 4న జేఎన్టీయూహెచ్ కాలేజీలో నిర్వహించు టెట్ పరీక్ష ఏర్పాట్లపై గురించి సంబంధిత అధికారులతో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జేఎన్టీయూహెచ్ కేంద్రంలో 160 మంది అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో ఉదయం 9 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్త్ తో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్ లు కేంద్రం పరిసరాల్లో మూసివేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎమ్ లతో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు, అభ్యర్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, కంప్యూటర్లు, జనరేటర్, అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.