calender_icon.png 29 January, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సాపూర్ లో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ

29-01-2026 04:30:03 PM

మెదక్, జనవరి 29 (విజయ క్రాంతి) : నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు కొనసాగుతున్న సందర్భంగా, గురువారం మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ నర్సాపూర్ పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా కొనసాగేందుకు తీసుకున్న భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతూ, నర్సాపూర్ పట్టణంలో మొత్తం 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయడంతో మంచి ఓటింగ్ శాతం నమోదైందని గుర్తు చేశారు.

అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని అదనపు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అదనపు ఎస్పీ  వెంట  నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి,  సిబ్బంది ఉన్నారు.