29-01-2026 04:28:47 PM
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్,(విజయక్రాంతి): రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి అభివృద్ధి చేస్తాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. గురువారం 47వ, 21వ డివిజన్ల బిఆర్ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్ ల నామినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా రాంనగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ నగరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రూపాయలు కూడా తీసుకు రాలేదని.. పొన్నం ప్రభాకర్ గాని బండి సంజయ్ గాని నగరానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు
1650 కోట్ల రూపాయలతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పాలనలో విఫలమయ్యాయని విమర్శించారు. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.. బిజెపి పార్టీ ఎన్నటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టిఆర్ఎస్ అని .. తెలంగాణ రాష్ట్రంలో రాబోవు రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ రాబోతుందని దిమా వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ గా చల్ల స్వరూప రాణి హరిశంకర్లు డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేశారని.. వారు మీ ఇంటి బిడ్డగా ఉండి ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారని.. వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్, బిఆర్ఎస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.