calender_icon.png 7 January, 2026 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి

06-01-2026 01:34:19 AM

మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతుల ఆందోళన

సోయా కొనుగోలు చేయాలని డిమాండ్

నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు పిలుపు

ఆదిలాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సోయా కొనుగోలు చేపట్టాలంటూ మంగళవారం చేపట్టే ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని పిలుపునిచ్చారు.

రైతుల పక్షాన బీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టైనా రైతు సమస్యల పరిష్కారానికి ముందుంటామని జోగు రామన్న అన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలు చేస్తూ సోయా కొనుగోళ్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేందుకు వెనకడుతున్నారని ఆరోపించారు. సోయా కొనుగోళ్లలో అధికార యంత్రం నిర్లక్ష్యంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతాంగం మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వేసిన కమిటీ సైతం రైతుల పక్షాన మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోయా కొనుగోలుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని అఖిలపక్షం నేతలతో కలిసి కలిసి, సమస్యను పరిష్కరించాలని సూచించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 75% కొనుగోలు చేసి కేంద్రంతో 20% కొనుగోలు చేయించామన్నారు. కేంద్రం వెనుకడుగువేసినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానంతో రైతులు పూర్తిగా మోసపోతున్నారని, వ్యవసాయాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేట్‌కు మద్దతుగా ప్రభుత్వాలు పని చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం కేవలం రూ.133 కోట్ల ఖర్చుతో రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనవచ్చు, కానీ బడా కార్పొరేటర్ల బాకీలు రూ.12 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ  చేసిందన్నారు.

రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంపై మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పటి వరకు 29 మంది రైతులు చనిపోగా, కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ కాపాస్ యాప్, తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, యూరియా కొరత, రైతు రుణమాఫీ, ఇలా అనేక ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకుంటే బీఆర్‌ఎస్ పార్టీ కార్యచరణ కొనసాగిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఆందోళనలో నాయకులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బాని, మారశెట్టి గోవర్ధన్, లింగరెడ్డి పాల్గొన్నారు.