calender_icon.png 7 January, 2026 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభలో చర్చించే బాధ్యత బీఆర్‌ఎస్‌కు లేదా?

06-01-2026 01:38:17 AM

  1. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   

హైదరాబాద్, జనవరి 5(విజయక్రాంతి): అసెంబ్లీ శీతాకాల సమవేశాలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎందుకు హాజరుకావదం లేదో సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సభకు గైర్హాజర్ కావడం, ప్రజా సమస్యలపై చర్చల నుంచి బీఆర్‌ఎస్ తప్పించుకోవడం సరికాదని డిప్యూటీ సీఎం హితవు పలికారు. సోమ వారం అసెంబ్లీలో లాబీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

రాష్ట్రానికి కీలకమైన పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బీఏసీలో బీఆర్‌ఎస్ పట్టుపట్టిందని, తీరా ప్రభుత్వం చర్చకు సిద్దమైతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడి సభ నుంచి పారిపోయారన్నారు. వాళ్లకు ఇబ్బంది అనిపించిన రోజున వాకౌట్ చేశారంటే అర్థం ఉందని, కానీ, మిగతా రోజులు సభకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలన్నారు, అసెంబ్లీకి రాకుండా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేయడం సరికాదని భట్టి హితవు పలికారు.

శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురవడంపై భట్టి స్పందిస్తూ ఆమె మాట్లాడిన ప్రతి మాట సభలో రికార్డు అయిందన్నారు, సభలో జరిగిన పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోందని, నిబందనల ప్రకారమే చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ రాష్ట్రాలపై భారం వేస్తుంటే, దానిపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా..?

అని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలపై ఏ సమయంలోనైనా చర్చకు సిద్దంగా ఉందని, బీఆర్‌ఎస్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.  

ప్రజలను ‘అందెశ్రీ’ ఏకం చేశారు 

జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయన కుమారుడు దత్తసాయికి ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. 25 నవంబర్ 2025న ఆర్డినెన్స్ 7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని, ఆరోజు శాసనమండలి సమావేశంలో లేనందున ఆ ఆర్డినెన్స్‌ను ఈరోజు అందరి చేత ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షనీయమన్నారు.

నాణ్యమైన విద్యుత్ సేవలందిస్తాం: శాసనమండలిలో డిప్యూటీ సీఎం 

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరా సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2022 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఏకంగా 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించినట్లు తెలిపారు.

కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల అనుగుణంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ అంతరాయం కలిగితే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ’108’ తరహాలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో కూడిన వాహనం క్షేత్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు.