calender_icon.png 9 January, 2026 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

07-01-2026 08:13:27 PM

జనవరి 10వ తేదీన చలో సూర్యాపేట

వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ చారి

బాలాజీ నగర్ లో గోడపత్రిక ఆవిష్కరణ

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని దీని కొరకై జనవరి 10వ తేదీన చలో సూర్యాపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి జవహర్ నగర్ వికలాంగుల కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ చారి, పెర్క సునీతలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ గోడపత్రికను  ఐలపు పద్మ అధ్యక్షతన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఇఫ్టు కన్వీనర్ షేక్షావలి హాజరై మాట్లాడుతూ... ఉద్యమకారుల న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్ల సాధన కొరకు జరుగుతున్న చలో సూర్యాపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కవులు కళాకారులు విద్యార్థులు మహిళల తోబాటు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు ఆశయాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు.

ఆ కుటుంబాలు నేడు స్వరాష్ట్రంలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సహస్థితిలో ఉన్నారని వారి త్యాగాలతో అందలమెక్కిన వారు పదవులు అధికారం దక్కించుకున్నారని, కానీ త్యాగాలు చేసిన వేలాది ఉద్యమకారులకు నేటికీ ఆర్థికంగా మానసికంగా కనీసం నిలువ నీడ లేదని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, నెలకు 30,000 వేల గౌరవ వేతనం, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల నగదు అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉద్యమ సంఘాల చే ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వంపై వత్తిడి చేయాలని కోరారు.