31-07-2025 10:08:17 AM
నాగార్జునసాగర్, విజయక్రాంతి: నాగార్జునసాగర్: మహాబలేశ్వరంలో పుట్టి.. కొండా కోనలు.. వాగు లు వంకలు దాటుతూ.. అన్నదాతల ఆశల సౌధాలు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల ను నింపి.. బిడ్డల పరవశాన్ని ఒడిన నింపుకొని నాగార్జునసాగర్‌కు చేరుకున్న కృష్ణమ్మ.. సాగర్26 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో సాగరం వైపునకు పరుగులిడుతోంది. ఏడాదిగా బోసిపోయిన నది, పరీవాహక ప్రాంతమంతా ఒక్కసారిగా కృష్ణమ్మ గలగలలతో పులకరించింది. ఒంపులుతి రుగుతూ.. సవ్వడులు చేస్తూ.. కృష్ణమ్మ నాగార్జునసాగర్ నుంచి 21కిలోమీటర్ల దూరంలో ఉన్న టెయిల్‌పాండ్‌కు,అక్కడి నుంచి 18కిలో మీటర్ల దూరంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోం ది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 149కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. వేల కిలోమీటర్లు అలుపెరగని ప్రయాణంతో అలసి సొలసిన కృష్ణమ్మ ఏపీ రాష్ట్రం ప్రకాశం బ్యారేజీకి చేరుకొని హంసల దీవి వద్ద సముద్రంలో ఏకమవుతుంది
నాగార్జున సాగర్ జలాశయం నుంచి 26 క్రస్ట్ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు అందంగా కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాలనురగలా స్పీల్‌వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ జళకళను సంతరించుకుంది.వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న భారీ వరద. ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.16 గేట్లు 5 ఫిట్లు,10గేట్లు10 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.
సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.00 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 300.3200 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,029 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 8144 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వారా 7272 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా 300క్యూసెక్కుల నీటిని మొత్తం 3,11,625 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో...2,82,364 క్యూసెక్కుల శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది ఔట్ ఫ్లో...2,47,213 3,11,625 గువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ, ప్రస్తుత నీటినిల్వ 303.టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతున్నారు.
పర్యాటకుల రాకతో కళకళ
ఈ రోజు తెలంగాణ, ఆంధ్ర నుంచి అధిక సంఖ్య పర్యాటకులు చేరుకోవడంతో సాగర్ పరిసరాలు రద్దీగా మారాయి. పర్యాటకుల సందడి..సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తున్నారు. సాగర్‌లో పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్తవంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేశారుఉ. హిల్‌కాలనీ విజయవిహార్ అతిథి గృహం వెనక వైపున ఉన్న నూతన లాంచీ స్టేషన్ ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యాంకు కాల్షియం ముప్పు
కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ… ప్రతీ ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ… బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ…నవ నాగరికతకు నిలయమై, అందరికీ ఆరాధ్యమై, ఆధునిక ఆలయమై విలసిల్లుతోంది మన బహుళార్థకసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందిన సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యాం ’గురించి కీలక విషయం విజయక్రాంతితో వెలుగులోకి వచ్చింది. ఈ జలాశయానికి ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించే నాగార్జునసాగర్ జలాశయానికి కాల్షియం వల్ల ముప్పు ఏర్పడుతోంది. జలాశయం లోపలి గోడల రంధ్రాల్లో పేరుకుపోయిన ఈ ఖనిజం వల్ల డ్యాం స్పిల్‌వేతో పాటు గ్యాలరీలోని గోడలకు పగుళ్లు ఏర్పడే అవకాశముందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు గోడల్లో పేరుకుపోయిన కాల్షియంను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జలాశయం లోపలి వైపున నిల్వ ఉన్న నీటి ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఊట నీరు బయటకు రావడానికి గ్యాలరీల్లో ప్రతి పది అడుగుల దూరంలో ఒక రంధ్రం చొప్పున డ్యాం నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేశారు. ఇవి సుమారు 1200 వరకు ఉన్నాయి. వీటిని పోరస్ హోల్స్ అంటారు. వీటి నుంచి నీరు నిత్యం బయటకు వస్తూ ఉండటంతో ఈ నీటిలో ఉన్న కాల్షియం రంధ్రాల్లో పేరుకుపోతోంది. దీంతో నీటి ఒత్తిడిని తట్టుకొని ఊటనీరు బయటకు పోవడానికి ఏర్పాటు చేసిన రంధ్రాలు పూడుకుపోతున్నాయి. దీని వల్ల అంతిమంగా డ్యాంపై ఒత్తిడి పెరిగి జలాశయ గోడలకు పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దాదాపు సగం పోరస్‌హోల్స్ కాల్షియంతో పూడిపోయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.