13 April, 2026 | 3:41 AM

జగిత్యాలలో కల్తీ పాల దందా!

08-12-2024 02:32 AM

* అనారోగ్యానికి గురైన ఓ కుటుంబం

* వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు

* పాల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిన అధికారులు

జగిత్యాల, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటామని భావించిన ఓ కుటుంబం.. రోజూ పాలు తాగుతూ అనారోగ్యానికి గురైన ఘటన జగిత్యాల పట్టణంలోని చోటుచేసుకున్నది. వివరాలిలా.. జగిత్యాల పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన లావణ్య రెండేళ్లుగా మేడిపల్లి మండలానికి చెందిన పాల వ్యాపారి మైదం మల్లయ్య వద్ద పాలు తీసుకుంటున్నది.

కొద్ది రోజులుగా ఆ పాలు తాగుతున్న లావణ్య కుటుంబం క్రమంగా అనారోగ్యానికి గురైంది. విరేచనాలు, ఒంటిపై దద్దుర్లు రావడంతో పాలల్లో కల్తీ జరిగిందని అనుమానించారు. ఈక్రమంలో వారు తాగుతున్న పాలను మూడు రోజుల పాటు నిల్వ ఉంచినా అవి విరగకపోవడంతో సదరు వ్యాపారిని నిలదీశారు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధిత కుటుంబం శనివారం పోలీసులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ అనూష పాల శ్యాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.