calender_icon.png 5 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్‌లో కల్తీ నూనెలు

05-01-2026 12:12:41 AM

ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ సరఫరా

పొద్దు తిరుగుడు నూనెలో పత్తి గింజల నూనె

ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం

తనిఖీల మాటున అధికారుల వసూళ్లు

గజ్వేల్, జనవరి 4: మార్కెట్లో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అత్యుత్తమ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వస్తున్న వంట నూనెలను ప్రజలు వినియోగిస్తూ అస్వస్థతను  కొనితెచ్చుకుం టున్నారు. సాధారణ పప్పులు, ఇతర పదార్థాలతో పాటు వంట నూనెలను కూడా కల్తీ చేస్తున్నారు. గజ్వేల్ ప్రాంతంలో ఏళ్ల తరబడిగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన వంట నూనెలను కల్తీ చేస్తూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధిక లాభాలను ఆర్జించడానికి నూనెలలో ఇతర నూనెలు పదార్థాలు కలుపుతూ కల్తీ చేయడమే కాకుండా ప్రముఖ కంపెనీల కవర్లను ముద్రించి వాటి ద్వారా కల్తీ వంట నూనెలను విక్రయిస్తున్నారు.

ముఖ్యంగా ఓ ప్రముఖ కంపెనీ పేరుతో ప్రచారంలో ఉన్న పొద్దు తిరుగుడు విత్తనాలతో తయారు చేసిన వంట నూనెలను పత్తి గింజల నూనెతో కలిపి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ నూనెను సాధారణంగా వంటలకు విక్రయించిన సమయంలో ఎలాంటి తేడా కనిపించడం లేదు. మాంసాహారం కానీ, తిను బండారాలు కానీ ఎక్కువగా వేయించిన ప్పుడు ఆ పదార్థాలు, నూనె కూడా పత్తి గింజల నూనె మాదిరిగా వాసన వస్తున్నాయి. కొనుగోలుదారులు కిరాణా దుకాణం యజమానులను అడిగిన సందర్భంలో డీలర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

సంబంధిత డీలర్లు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ, నూనె ప్యాకెట్లపై ఉండే కంపెనీ అడ్రస్ ను సంప్రదించాలని సూచిస్తూ చేతులెత్తేస్తున్నారు. సదరు కంపెనీ వంటనూనె పత్తి గింజల నూనె మాదిరిగా వాసన వస్తుందని డీలర్ ని వివరణ కోరగా పత్తి గింజల నూనె కలపడానికి ప్రభుత్వాలే అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం. 

వేర్వేరు నూనెలు కలిపేందుకు  ప్రభుత్వ అనుమతులు ఉండవు

వంటనూనె ( పొద్దు తిరుగుడు గింజల నూనె) కల్తీ విషయంలో జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో  పూర్వ అధికారులను సంప్రదించగా అసలు విషయం బయట పెట్టారు. వేర్వేరు గింజల నూనెను కలిపి వంట నూనెగా విక్రయించడానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదని వారు వెల్లడించారు. ప్రతి వంటనూనె ప్యాకెట్లపై ఏయే పదార్థాలు వంట నూనె తయారీకి వినియోగిస్తారో వివరాలు రాసి ఉంటాయని చెప్పారు.

అంటే డీలర్లు కూడా ఈ విషయంలో వాస్తవాలను దాచిపెడుతున్నట్లు అధికారుల మాటల ద్వారా తేటతెల్లం అవుతుంది. గజ్వేల్ ప్రాంత అధికారులతో పాటు, జిల్లా స్థాయి అధికారులు సైతం మామూళ్ల మత్తులో తనిఖీలు చేపట్టకపోవడంతో కల్తీ వంట నూనెను వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ప్రముఖ కంపెనీ వంటనూనె కల్తీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.