12-08-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఆగస్టు 11(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో కొంత మంది కల్తీ కల్లు తయారు చేసి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. రసాయనాలు, ఇతర పదార్థాలు కలిపి అచ్చం ఈత కల్లులా తయారు చేస్తున్నారు. వీటిని తాగిన జనం అనారోగ్యం భారిన పడుతున్నారు.
పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ’మామూలు’గా వ్యవహరించడంతో ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు సేవించి తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఆ శాఖ నామమాత్రపు తనిఖీలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. కొరడా ఝళిపించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
సంగారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలోఈత చెట్లు ఉండగా ప్రతీరోజు వేలాది లీటర్లకు పైగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో చెట్లు తక్కువగా ఉన్నప్పటికీ తయారయ్యే కల్లు అధికం. మొత్తంగా 5 శాతం కల్లు ఉంటే 85 శాతం రసాయనాలతోనే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు..
కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండటంతో తాగి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తంలో తయారు చేసి కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు.
వీటిని తాగిన వారి శరీర అవయవాలు పనిచేయకుండా పోయి ప్రాణాంతకంగా మారుతోంది. క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్ వంటివి అధిక మోతాదులో కలపడంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస తగ్గిపోవడం, బీపీ తగ్గడం, కోమాలోకి వెళ్లడంతో మరణం సంభవిస్తుంది. కాలేయం, కిడ్నీలపైనా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తయారీ ఇలా...
స్వల్పంగా సేకరించిన కల్లులో నీటితో పాటు రసాయనాలు అధిక మోతాదులో కలుపుతున్నారు. ముఖ్యంగా క్షోరల్ హైడ్రేట్, అల్పజ్రోలం, డైజోఫామ్, ఓపీఎం ఇతడ రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. వీటిని తాగిన వారు మత్తులో తూగుతున్నారు.
పులుపు కోసం లెమన్ సాల్ట్, తీపి కోసం షాక్రిన్, పులియ బెట్టడానికి డైయిస్ట్ పౌడర్, తెలుపు కోసం టైటానియం డయాక్సైడ్, నురుగు కోసం కుంకుడుకాయ ఇతర రసాయనాలు కలుపుతున్నారు. ఇది అచ్చం ఈత, తాటికల్లు లాగా కనిపిస్తోంది. కానీ ఇందులో ఒక శాతం కూడా వాటి ఆనవాళ్లు ఉండడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ అధికారులు...
జిల్లాలో యథేచ్ఛగా కల్తీకల్లు భారీగా తయారు చేసి లక్షలాది రూపాయలు మద్యం ప్రియుల నుండి దోచుకుంటూ వారి ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం కల్లు వ్యాపారులు, మద్యం వ్యాపారులు నెలనెలా ప్యాకేజీలు అందిస్తుండడంతో కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తూ వ్యాపారులకు మద్దుతు పలకడం శోచనీయం. ఎక్కడా లేని విధంగా సంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. నెలనెలా లక్షలాది రూపాయలు అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.