calender_icon.png 26 December, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే

26-12-2025 09:18:49 PM

గతంలో కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేయలేదా?

క్షమాపణ చెప్పిన తర్వాతే పాలమూరులో సభ పెట్టాలి

 విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్

జడ్చర్ల: నాడు ఉద్దండపూర్ భూ నిర్వాసితులు కేసీఆర్ ను కలిసేందుకు పోతే అరెస్టు చేయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు మాయమాటలు చెప్పేందుకు మరోసారి సన్నద్ధం కావడం విడ్డూరంగా ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మెసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉదండాపూర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పాలమూరులో సభ పెట్టాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు.

పాలమూరు ప్రాజెక్టు ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ను కలవబోతే వారిని కలవకపోగా ఎందుకు అరెస్టు చేయించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పెట్టించారని ప్రశ్నించారు. కేసీఆర్ తాను కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత ఈ ప్రాజెక్టును గాలికివదిలేసారని విమర్శించారు. గతంలో నార్లాపూర్ కు వెళ్లి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిపోయిందని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టులో 70శాతమే పూర్తయిందని, మరో 30 శాతం పనులు కాలేదని ఇప్పుడు మాట ఎందుకు మార్చారని అనిరుధ్ రెడ్డి నిలదీసారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటి నిల్వను పెంచుకోవడానికి 32 వేల కోట్ల రుపాయలను కేసీఆర్ కేటాయించారన్నారు. కేసీఆర్ కు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పై నిజంగా ప్రేమ ఉంటే కాళేశ్వరానికి అదనపు టీఎంసీ కోసం ఇచ్చిన రూ 32 వేల కోట్ల  ఉదండాపూర్ రిజర్వాయర్ కు, పాలమూరు ప్రాజెక్టుకు ఇచ్చి ఉంటే పాలమూరు ప్రాజెక్టు పూర్తయి ఉండేది కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవలంభించిన ద్వంద విధానం కారణంగా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.

అందుకే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడడానికి కేసీఆర్ పాలమూరు కు రావడానికి ముందే ఉదండాపూర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా వారిని రోడ్డు మీదికి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ నాయకులదన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని దశలవారీగా చెల్లించడంతో పాటుగా పరిహారం మొత్తాన్ని అదనంగా రూ.145 కోట్లకు పెంచారని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసమే పాలమూరు ప్రాజెక్టును గాలికి వదిలేసిన కేసీఆర్ ఉదండాపూర్ నిర్వాసితులకు, పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇక్కడ సభ పెట్టాలన్నారు.