25-07-2024 02:20:00 AM
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొన్నది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్నపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పై స్కిడ్ అయి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. దీంతో విమానం ముక్కలై మంటలంటుకొన్నాయి. ప్రమాద సమయంలో అందులో 19 మంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ విమాన పైలట్‌ను దవాఖానకు తరలించారు.
ఈ విమానం 20 ఏళ్ల నాటిదని తెలుస్తోంది. ఈ విమానాన్ని నిర్వ హిస్తున్న శౌర్య ఎయిర్‌లైన్స్ ఆర్థిక కష్టాల్లో ఉండటంతో దీని మెయింటనెన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విమానాన్ని మెయింటనెన్స్ కోసం తీసుకెళ్తుండగానే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. నేపాల్‌లో తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడి విమానాశ్రయాలన్నీ టేబుల్ టాప్ రకమే కావటంతో చిన్న పొరపాటుకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. కొండలపై ఏర్పాటుచేసే ఈ రన్‌వేలకు ముందు, వెనుక లోతైన లోయల్లాంటి ప్రదేశాలు ఉన్నాయి. దీంతో విమానాలు ఏమాత్రం పట్టు తప్పినా వాటిల్లో పడి ధ్వంసమవుతున్నాయి.
నేపాల్‌లో కూలిన విమానం
రన్‌వేపై స్కిడ్ అయి కుప్పకూలిన 20 ఏళ్ల నాటి విమానం
ప్రమాదంలో 18 మంది శౌర్య ఎయిర్‌లైన్స్ సిబ్బంది మృతి
ఖాట్మండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
ఖాట్మండు (నేపాల్), జూలై 24: నేపాల్‌లో మరో విమాన ప్రమాదం చోటుచేసు కుంది. రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పై స్కిడ్ అయి పక్కనే ఉన్న గొయ్యిలో పడటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ విమానం 20 ఏళ్ల నాటిదని తెలుస్తోంది. అంతేకాకుండా శౌర్య ఎయిర్‌లైన్స్ ఆర్థిక పరిస్థితి సైతం అంతంతమాత్రంగానే ఉంది. శౌర్య సంస్థ ఖాట్మండు ఎయిర్‌పోర్టుకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించలేకపోవడంతో దాని సర్వీసులను నిలిపేశారు. కొన్నేళ్లకు భారత్‌కు చెందిన కుబేర్ గ్రూప్‌తో ఒప్పందంతో 49 శాతం వాటా ఈ సంస్థ చేతికి వచ్చింది. ఈ డీల్ విలువ 56 లక్షల డాలర్లు.
కఠినమైన నేపాల్ రన్‌వేలు
నేపాల్ హిమాలయ పర్వతాల్లో భాగంగా ఉండటం వల్ల రన్‌వేలు కఠినంగా ఉంటా యి. అంతేకాకుండా ఇక్కడ వాతావరణం వేగంగా మారిపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సాధారణంగా మౌంట్ ఎవరెస్ట్‌ను వేలసంఖ్యలో సందర్శిస్తారు. వీరి కి ఖాట్మండ్ ఎయిర్‌పోర్టు మాత్రమే దిక్కు. కానీ ఇక్కడ రన్‌వే చాలా చిన్నది. పొడవు 527 మీటర్లు మాత్రమే. ఎయిర్‌పోర్టులు పర్వతాలపై సముద్రమట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి సాంద్రత సైతం అధికంగా ఉంటుంది.
దీంతో విమాన ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. మరోవైపు హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. ఇదేకాకుండా నేపాల్‌లో చాలా విమానాలు 20 ఏళ్ల నాటివి కావడం ఈ పరిస్థితులను తట్టుకోలేకపోతున్నాయి. ఈ విమానాల్లో అత్యాధునిక వాతావరణ రాడార్లు, జీపీఎస్ టెక్నాలజీ వంటివి ఉండవు. అందుకే బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలు నేపాల్‌లో పర్యటించే తమ దేశస్థులకు ముందస్తు జాగ్రత్తలను సైతం జారీ చేస్తుంటాయి.
నిర్వహణ పరీక్షలకు వెళుతుండగా
నిజానికి చాలా రోజులు అనుమతులు లేకపోవడం, ఆ విమానం 20 ఏళ్ల నాటిది కావడం వల్ల నిర్వహణ నిమిత్తం ఖాట్మండు నుంచి పొఖారా ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. టేకాఫ్ కాగానే రన్‌వే దక్షిణం వైపునకు స్కిడ్ అయిన విమానం గొయ్యిలో పడింది. ఈ ప్రమాదంలో మరణించినవారంతా శౌర్య సంస్థకు చెందిన సిబ్బంది కావడం గమనార్హం. ఈ ప్రమాదానికి నిర్వహణ లోపాలతో పాటు నేపాల్ పరిస్థితులు కూడా కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్‌లో భౌగోళిక పరిస్థితుల వల్ల గత కొన్ని దశాబ్దాలుగా వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది సైతం యతి ఎయిర్‌లైన్స్ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలి 72 మంది మరణించారు. ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. నేపాల్‌లో విమాన ప్రమాదాలకు భౌగోళిక, ఆర్థికంగా అనేక కారణాలు ఉన్నాయి.