25-07-2024 01:16:17 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): టీడీపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సృష్టిస్తున్న రావణకాష్టం, ప్రజలను హింసిస్తున్న విధానం దేశం మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉందని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం రోజు దేశ రాజధాని ఢిల్లీలో అందుకోసమే నిరసన చేశామ న్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అనివార్య పరిస్థితి నెలకొందని, నిరసన వేదిక వద్ద ఏర్పా టు చేసిన గ్యాలరీలోని ఫొటోలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా చంద్రబాబు మాత్రం మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో ప్రభుత్వం కూలిపోవాలని తమ ఉద్దేశం కాదని, రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రధాని, రాష్ట్రపతి, మీడియాపై ఉందని చెప్పడానికే ఢిల్లీకి వచ్చామని తేల్చి చెప్పారు. ఇలాంటి దాడులను వెంటనే అరికట్టకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుందని హితవు పలికారు. వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన వెంటనే జగన్‌మోహన్ రెడ్డి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.