03-05-2025 12:27:06 AM
- విచారణ అనంతరం షాద్నగర్ కోర్టుకు..
- అక్కడి నుంచి చంచల్ గూడకు తరలింపు
చేవెళ్ల , మే 2 : పూజల పేరుతో మహిళ (సినీ నిర్మాత)ను మోసం చేసిన కేసులో నిందితుడు అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి (28)ను శుక్రవారం మోకిలా పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహిళ నుంచి రూ.9.80 లక్షలు వసూలు చేసి, మరో రూ.5 లక్షల కోసం బెదిరించిన కేసులో అఘోరిని మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి ఏప్రిల్ 23 న చేవెళ్ల కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
కేసు విచారణలో భాగంగా వివరాలు సేకరించేందుకు.. పోలీసులు అఘోరిని మూడు రోజుల కష్టడీని ఇవ్వాలని కోర్టును కొరారు.జడ్జి ఒక రోజు కష్టడీకి అనుమతి ఇవ్వగా. శుక్రవారం అఘోరిని చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. సీఐ వీరాబాబు, డీఐ సమరం రెడ్డితో కలిసి 2 గంటల పాటు విచారించారు.
మహిళ కేసుతో పాటు ఆమె కారులో ఉన్న త్రిశూలాలు, ఇతర పరికరాల గురించి వివరాలు సేకరించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి చేవెళ్ల కోర్టు కు ఇన్చార్జిగా షాద్నగర్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ఆయన కేసు వివరాలను పరిశీలించి, అఘోరీని మళ్లీ చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా, మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు.