తెలంగాణ ఐటీకి ఏఐ సవాల్
ఎ.చంద్రశేఖర్‌రావు :
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) అడుగులు వేగవంతం కావడంతో ఉపాధి మార్కెట్లో పెను అలజడి మొదలైం ది. చాట్-జీపీటీ, మిడ్ జర్నీ, కోపైలట్, జెమిని వంటి అధునాతన టూల్స్ వివిధ పరిశ్రమల పనితీరును సమూలంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ ఐటీ రాజధానుల్లో ఒకటైన హైదరాబాద్‌పై దీని ప్రభావం స్పష్టం గా కనిపిస్తోంది. నిన్నటివరకు కేవలం యాంత్రిక పనులకే పరిమితమనుకున్న సాంకేతికత.. నేడు సృజనాత్మక రంగాల్లోకి, మేనేజ్‌మెంట్ స్థాయి ల్లోకి చొచ్చుకుపోతోంది.
గతంలో వంద మంది మానవ వనరులతో నెలల తరబడి చేసిన ప్రాజెక్టులను, నేడు ఏఐ సాయంతో కొద్దిమంది ఉద్యోగులే రోజుల్లో పూర్తిచేస్తుండటం శ్రామిక శక్తి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను పెంచుతోంది. హైదరాబాద్‌లోని కంపెనీలు ఇప్పటికే ఏఐ టూల్స్ ను విస్తృతంగా వాడుతున్నాయి. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కోడింగ్, కస్టమర్ కేర్ (కాల్ సెంటర్లు), కంటెంట్ రైటింగ్, బేసిక్ డేటా ఎంట్రీ, గ్రాఫిక్ డిజైనింగ్ రంగాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి.
దీంతో క్యాంప స్ నియామకాలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే మరోవైపు, టైర్- నగరాలైన నిజామాబాద్, సిద్దిపేట, ఖమ్మం వంటి ఐటీ టవర్లలో సాంకేతిక మార్పుల వల్ల కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నాణేనికి ఉన్న మరోవైపును గమనిస్తే.. పాత ఉద్యోగాలు కొన్ని కనుమరుగవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
తాజా లింక్డ్‌ఇన్ లేబర్ మార్కెట్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏఐ ఉద్యోగాల నియామకాలు ఏకంగా 59.5 శాతం పెరగ్గా, అందులో హైదరాబాద్ 51 శాతం వృద్ధితో దేశంలోనే కీలకమైన టాలెంట్ హబ్‌గా అవతరించింది. ఏఐ ప్రాంప్ట్ ఇంజినీర్స్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ట్రైనర్, సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ వంటి విభాగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఏఐ తెస్తున్న మార్పులను తట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది.
ఏఐ కారణంగా ఉద్యోగాల స్థానభ్రంశంపై జాతీయ స్థాయిలో అంచనా వేయాలని, భారీగా రీ--స్కిల్లింగ్ (నైపుణ్యాల శిక్షణ) పై పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ వేదికలపై ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్- 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రం లో ఏఐ సిటీ (1,500 ఎకరాల్లో), ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ‘తెలం గాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, యువతకు ఉచితంగా ఏఐ/ఎంఎల్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.
ప్రభుత్వంలోని 35 శాఖలలో పారదర్శకత, వేగం పెంచడానికి ప్రత్యేక ఏఐ నోడల్ అధికారులను కూడా నియమిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అడవిశ్రీరాంపూర్‌లో దేశంలోనే తొలి ఏఐ గ్రామం, హైదరాబాద్‌లో 1,500 ఎకరాల ఏఐ సిటీ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. అయితే ప్రధానంగా కాల్ సెంటర్ ప్రతినిధులు, బేసిక్ డేటా ఎంట్రీ, జూనియర్ టెస్ట ర్స్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు కోత పడే ప్రమాదం ఉంది.
కొత్తగా ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్టులకు భారీ డిమాండ్ ఉంది. ఏఐ మిమ్మల్ని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయదు.. కానీ ఏఐని సమర్థవంతంగా వాడటం తెలిసిన మరో వ్యక్తి మీ స్థానాన్ని భర్తీ చేస్తాడు.. అన్నది నేటి చేదు నిజం.
గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడూ ఉద్యోగాలు పో తాయనే ఆందోళనలు వ్యక్తమయ్యా యి. కానీ, ఆ కంప్యూటర్ విప్లవమే ఆ తర్వాత ఐటీ రంగాన్ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఏఐ విషయంలో నూ అదే పునరావృతం కానుంది. సాంకేతికతను సహచరుడిగా వాడుకున్నప్పుడే భవిష్యత్తు ఉపాధి మా ర్కెట్లో నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది.
వ్యాసకర్త: ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇంచార్జి,
విజయక్రాంతి






