7 August, 2026 | 2:28 AM

నిరసనా ఓ హక్కే!

07-08-2026 12:00 AM

ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలకు ఉన్న అత్యంత విలువైన హక్కుల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఒకటి. అన్యాయం జరిగినప్పుడు తమ గళాన్ని వినిపించడం ప్రాథమిక హక్కు. కాగా, విద్యావ్య వస్థలో లోపాలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకులపై ఇటీవల దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనల సందర్భంగా రాజ్యాంగం కల్పించిన ఈ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందనే విమర్శలు వినిపించాయి.

పరీక్షల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని ఢిల్లీ వేదికగా వేలాది మంది యువత శాంతియుతంగా చేసిన ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం పునరుద్ఘాటించడం ముదావహం. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దారులను మూసివేయడం సరికాదనే విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

ప్రజల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అదే సమయంలో నిరసన తెలిపే హక్కు ఎంత ముఖ్యమైనదో, ఆ నిరసన శాంతియుతంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని చెప్పక తప్పదు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పడం విశేషం. నిరసన చేపట్టిన యువతకు కూడా ధర్మాసనం పలు కీలకమైన సూచనలు చేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

యువత తమ హక్కుల కోసం పోరాడటంలో తప్పు లేదని కానీ, చట్టాన్ని గౌరవిస్తూ, శాంతియుత మార్గాన్నే ఎంచుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచన సముచితమే. హింస, విధ్వంసం, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు ప్రజాస్వామ్య పోరాట లక్ష్యాలను బలహీనపరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల సమస్యలను వినడం ప్రభుత్వ బాధ్యత అయితే, బాధ్యతాయుతంగా తమ గళాన్ని వినిపించడం ప్రజల హక్కు.

నిరసనలను అణచివేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. వాటి వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించి పరిష్కార మార్గాలు అన్వేషించినప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య విలువలను మరోసారి గుర్తుచేసిన నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుతూనే, శాంతియుత నిరసనలకు తగిన స్థానం కల్పించడం ప్రతి ప్రభుత్వ నైతిక బాధ్యత. హక్కులు, బాధ్యతలు రెండూ జోడెడ్లలా కలిసి ముందుకు సాగినప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా బలపడుతుంది.