calender_icon.png 13 December, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం

13-12-2025 07:27:54 PM

జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్..

మధ్యాహ్నం రెండు గంటల నుండి సర్పంచ్, వార్డు స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం..

హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం రోజున జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఐనవోలు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రితో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు.

ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పోలింగ్ కేంద్రాలలో ఆదివారం జరగనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

రెండో విడత ఎన్నికలకు సంబంధించిన వివరాలు

హనుమకొండ జిల్లాలో రెండో విడతలో ఈనెల 14న(ఆదివారం రోజున) ఐదు మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో మొత్తం ఓటర్లు 1,28,315 ఉన్నారు. ఇందులో పురుషులు 62692,  మహిళలు 65621, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఐదు మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 73, వార్డులు 694 ఉన్నాయి. రెండో విడతలో వార్డులు, సర్పంచ్ స్థానాలు కలిపి ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు 5 ఉన్నాయి. ఒక గ్రామపంచాయతీకి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది.

ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు 67 ఉండగా ఇందులో పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 248 కాగా పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు 1442 మంది ఉన్నారు. మొత్తం వార్డులు 694 ఉండగా ఇందులో ఏకగ్రీవమైన వార్డులు 120 ఉన్నాయి. పోలింగ్ జరిగే వార్డు స్థానాలు 574 ఉన్నాయి. ఐదు మండలాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 658, ప్రిసైడింగ్ అధికారులు 658, ఓపివోలు -961(మొత్తం పిఓ, ఓపిఓలు 1619), 23మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.