22-01-2026 05:21:26 PM
చిట్యాల, జనవరి 22(విజయ క్రాంతి): నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏవో మోహన్ బాబు గురువారం తెలిపారు. నమ్మిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న దేవస్థానల్లో తెలంగాణ రెండవ శ్రీశైలంగా పేరొందినది చెర్వుగట్టు దేవస్థానం. కొలిచిన భక్తులకు చల్లని చూపులు చూపే దేవుడిగా ఈ దేవాలయం ప్రసిద్ధి. ఈ కోనేటిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు పోతాయని, మనస్సులో కోరికలు తీర్చే దేవాలయం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కొలువు దిరింది. ఈ చెర్వుగట్టు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 వ తేది శుక్రవారం నుంచి 30 తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి.
జాతర ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ , స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి అన్ని శాఖల అధికారులతో వారం రోజుల క్రితం సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ గుట్టపైన అత్యంత ప్రాముఖ్యత స్వామి వారి కళ్యాణం , అనంతరం ఒడి బియ్యం పోయడం ఓ ఘట్టం, స్వామి వారి కళ్యాణం తిలకించడం కోసం లక్షలది మంది ఒస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. కళ్యాణ మండపానికి సమీపాన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళ్యాణాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ.ఓ మోహన్ బాబు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ జాడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం , ఆదివారం తెల్లవారుజామున అగ్ని గుండాలు , సోమవారం తెల్లవారుజామున అశ్వవాహన సేవ , రాత్రిపూట ఏకాంత సేవలు స్వామి వారికి నిర్వహించిన అనంతరం 31 వ తేది న బుధవారం సాయంత్రం స్వామి వారి విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించడం తో జాతర పూర్తి అవుతుందని తెలిపారు. స్వామి వారి కళ్యాణం కోసం వేలాదిమంది భక్తులు తమ మొక్కులను చెల్లించడం కోసం వడి బియ్యం , తలంబ్రాలు సమర్పన చేయడం కోసం భక్తులకు బారికేడ్లు ను ఏర్పాటు చేయడం జరిగిందని , భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, రెవిన్యూ, ఆలయానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. లైట్లు , మైకులు , గర్భగుడి లైటింగ్ వంటి పనులు పూర్తి చేయడం జరిగిందని, జడల రామలింగస్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామి వారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూసి మొక్కిన మొక్కులు తీర్చుకొని వెళుతుంటారు భక్తులు.