calender_icon.png 11 September, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖకు అన్నీతానై..

06-12-2024 12:30:16 AM

  1. పాఠశాల విద్యపై రేవంత్ ఫోకస్ 
  2. పదేళ్ల పాలనలో మినీ డీఎస్సీ
  3. ప్రజాపాలన పది నెలల్లో మెగా డీఎస్సీ 
  4. బీఆర్‌ఎస్ హయాంలో ఏడు వేల టీచర్ పోస్టుల భర్తీ
  5. కాంగ్రెస్ పాలనలో 11 వేల పోస్టుల ఉపాధ్యాయుల భర్తీ 
  6. జూలై, ఆగస్టు నెలలో పరీక్షల నిర్వహణ
  7. సెప్టెంబర్‌లో ఫలితాలు.. అక్టోబర్‌లో పోస్టింగ్ 
  8. వచ్చే ఏడాదిలో మరో డీఎస్సీకి కసరత్తు?

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాల విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులోనూ విద్యాశాఖ ఆయన వద్దే ఉండటంతో చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పలువేదికల్లో సీఎం మాట్లాడుతూ.. తాను జడ్పీ హైస్కూల్‌లోనే చదువుకున్నానని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలపై ఆయనకు ముందు నుంచే అవగాహన ఉండటంతో మరీ ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రక్షాళనకు ఆయన నడుంబిగించారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. నాణ్యమైన విద్యను అందించాలంటే ముందుగా ఉపాధ్యాయుల కొరతను అధిగమించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల నియామకాలపై సీఎం దృష్టిసారించారు. బీఆర్‌ఎస్ పాలనలో డీఎస్సీ ద్వారా కేవలం ఒకేసారి టీచర్ రిక్రూట్‌మెంట్ చేపడితే.. కాంగ్రెస్ 10 నెలల ప్రజాపాలనలో మెగా డీఎస్సీని నిర్వహించింది. బీఆర్‌ఎస్ 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. కొత్త ప్రభుత్వంలో 11,062 పోస్టులను భర్తీ చేసింది. 

ఇచ్చిన మాటప్రకారం పోస్టులు పెంచి..

తొలి ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం టీచర్  నియామకాలను పరుగులు పెట్టించింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది. మొదటి ఏడాదిలో 53 వేలకుపైగా ఉద్యోగ నియమకాలను చేపడితే.. ఇందులో డీఎస్సీ ద్వారానే 11,062 పోస్టులుండ టం విశేషం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5 వేలకుపైగా టీచర్ పోస్టులతో డీఎస్సీ వేసింది.

తాము అధికారంలోకి వస్తే పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పోస్టులు పెంచి 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిం ది. పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్‌లో దసరా సందర్భంగా ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు.

టీచర్ల సర్దుబాటు 

ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు.. ఉపాధ్యాయు లు ఉంటే పిల్లలు ఉండరనే విమర్శలున్నాయి. ఆ సమస్యను పరిష్క రించేందుకు పిల్లలు, టీచర్ల సంఖ్య మధ్య హేతబద్ధతను ప్రభుత్వం పాటించింది. ఒకటి నుంచి 10 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు.. 11 నుంచి 40 మంది విద్యార్థులున్న బడులకు ఇద్దరు ఉపాధ్యాయులు..

41 నుంచి 60 వరకు విద్యార్థులున్న బడులకు ముగ్గురు టీచర్లను కేటాయించడం తోపాటు 60పైన విద్యార్థులున్న చోట ఆయా పాఠశాలలకు మంజూరైన పోస్టులన్నింటికీ ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన సాగు తోంది. విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉంటే వారిని టీచర్లు తక్కువగా ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడుల కు షిఫ్టింగ్ చేశారు. దీంతో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.

ఏడాదిలో రెండు టెట్‌లు

ఉమ్మడి రాష్ర్టంలో మొదలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలం లో బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు టెట్ రాయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో.. ఎప్పుడు పరీక్ష పెడతారో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.

టెట్ రాసినవారు డీఎస్సీ రాశారు. ఇక నుంచి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ర్ట ప్రభు త్వం ప్రకటించింది. రెండోసారి కూడా టెట్ నోటిఫికేషన్‌ను వేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.

బదిలీలు, పదోన్నతుల్లో కీలక నిర్ణయాలు 

పర్యవేక్షణ కొరవడటంతో పాఠశాల విద్యా రంగం దెబ్బతిన్నది. బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే ప్రగతి ఉంటుందని భావించిన ప్రజాప్రభుత్వం అన్ని మండలాలకు ఎంఈవోను నియమిం చింది. దీంతోపాటు సుమారు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తిచేసింది.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న న్యాయ పరమైన చిక్కులు తొలగిపోయాయి. ఫలితమే రాష్ర్టవ్యాప్తంగా 21,419  మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ జీవితం ముగిసిపోతుందనే ఆందోళనతో ఉన్న వేల మంది ఉపాధ్యాయులకు రాష్ర్ట ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది.

పది, పదకొండేళ్లుగా ఒకేచోట పనిచేస్తూ ఏళ్లుగా పలువురు ఉపాధ్యాయు లు బదిలీల కోసం ఎదురుచూశారు. తరగతులకు ఆటంకం కలగకుండా నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులను బదిలీలను రాష్ర్ట ప్రభుత్వం పూర్తి చేసింది. 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలను రాష్ర్ట ప్రభుత్వం పూర్తిచేయడం హర్షించదగ్గ విషయమేనని పలు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

టీచర్ల కొరత తీర్చేలా..

పాఠశాల భవనాలు ఎంత గొప్పగా ఉన్నా.. విద్యార్థులు ఎన్ని లక్షల మంది ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి..మరో డీఎస్సీని వచ్చే ఏడాదిలో వేసేందుకు కసరత్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగా ఫిబ్రవరిలో దాదాపు 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ వేసి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.