calender_icon.png 11 September, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలకు పునర్‌వైభవం!

06-12-2024 12:34:59 AM

  1. ఏడాది ప్రజాపాలనలో ఆలయాల అభివృద్ధి
  2. ఆచార సంప్రదాయాలకు ప్రజాప్రభుత్వం పెద్దపీట
  3. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలంపై ప్రత్యేక దృష్టి
  4. అభివృద్ధికి వందల కోట్ల కేటాయింపు
  5. రూ.110 కోట్లతో సమ్మక్క-,సారలమ్మ జాతర

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణప్రజాప్రభుత్వం ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. సగటు భక్తుడికి ఆలయాలపై విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ఏడాది కాలంలో రాష్ర్టం లోని అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల అభివృద్దికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.

వందల కోట్ల నిధులను కేటాయిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేసున్నది. యాదగిరిగుట్ట, వేములవా డ, భద్రాచలం వంటి దేవాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణతో చుట్టు ఉన్న నాలుగైదు సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.110 కోట్లు విడుదల చేసి వన దేవతల పట్ల ప్రభుత్వానికి ఉన్న భక్తిని చాటుకున్నది. 

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.127 కోట్లు 

దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పర్యవేక్షణ కొరవడి ఇక్కడ భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. భవిష్యత్తులో కోడెలకు అటువంటి పరిస్థితి దాపురించకుండా చూడాలని అధికారులను సీఎం ్డఆదేశించారు.

గోశాలకు వచ్చే కోడెలను వివిధ మఠాలకు, గుర్తింపు పొందిన గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం రూ.127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది.

ఈ నిధులతో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు సౌకర్యాల కల్పన, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనే జీ పైప్‌లైన్ నిర్మాణం, మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు.

యదాద్రి కాదు యాదగిరి గుట్టనే..

తెలంగాణలో అతిపెద్ద దేవాలయం యాదగిరిగుట్ట. గుట్టగా.. గట్టుగా పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా గత ప్రభుత్వం మార్చినప్పటికీ ప్రజల మనోగతాన్ని గౌరవించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆలయం పేరును మళ్లీ యాదగిరిగుట్టగా ప్రకటించారు. దాదాపు వెయ్యి మంది భక్తులు కొండపై నిద్రించేందుకు వీలుగా డార్మిటరీ హాల్ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఆటోలు కొండపైకి వెళ్లకుండా గత ప్రభుత్వం నిషేధించింది. ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించడంతో 300 మంది ఆటో కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల కోసం ప్రసాదం కౌంటర్లను ప్రభుత్వం పెంచింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల వద్ద నీడ కోసం షెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

భక్తులకు ఇబ్బంది కలగకుండా గుట్టపైన ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మాణం పూర్తయింది. భక్తులు వేసవికాలంలో ఇబ్బందులు పడకుండా నీడలో సేదతీరడానికి 23వేల చదరపు అడుగుల్లో జర్మన్ హంగర్స్ షెడ్లను ఏర్పాటు చేసింది. గతంలో 500 మంది భక్తులకు మాత్రమే అన్నప్రసాదం సౌలభ్యం వుంటే, ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు వెయ్యిమంది భక్తులకు అన్నప్రసాదం సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లులు మొదలైన వారి కోసం ప్రత్యేక షెడ్డు, బ్యాటరీ వాహనాల ద్వారా దర్శన సదుపాయం కల్పించారు. దేశంలోని మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురమైన యాదగిరి గుట్ట దేవాలయ విమాన గోపురానికి మొత్తం 60 కిలోల బంగారంతో తాపడం పనులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

భద్రాద్రి రాముడికి భక్తితో..

తెలంగాణ ప్రజల ఇలవేల్పు అయిన భద్రాచలం, పర్ణశాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం ఆదేశాల మేరకు 180 కోట్లతో ఆలయ అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మాడవీధుల అభివృద్ధి, ఇతర పనులకు ఇప్పటికే రూ. 60.20 కోట్లు మంజూరు చేశారు. 


ఈ పనులు పూర్తికాగానే మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయనున్నారు. గోదావరి వరదల బారి నుంచి భద్రాచలాన్ని రక్షించేందుకు రూ.38 కోట్లతో కరకట్ట పనులు కొనసాగుతున్నాయి. 1.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 

తెలంగాణ కుంభమేళాకు రూ.110 కోట్లు..

తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు రాష్ర్ట ప్రభుత్వం భారీగా వ్యయం చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి సమ్మక్క- సారలమ్మ జాతరలో పాల్గొని బంగారం మొక్కు చెల్లించారు. జాతరకు భక్తులు సజావుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, ఆన్‌లైన్ సేవలు అన్నింటిని ప్రభుత్వం సమకూర్చింది.

రాష్ర్ట ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్ట, కర్ణాటక నుంచి జాతరకు వచ్చిన భక్తులు ఎంతగానో సంతోషించారు. జాతర్లకు బస్సు ఛార్జీలు పెంచి భక్తుల జేబులకు చిల్లుల పెట్టే సంస్కృతికి ప్రజాప్రభుత్వం చరమగీతం పాడింది. మేడారం జాతరకు మహిళా భక్తులకు ఉచితంగానే రవాణా సదుపాయం కల్పించడంతో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

బోనాల జాతర..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ప్రభుత్వం రూ. 15 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది.

ఈ ఏడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా రాష్ర్టస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్‌యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు/ కన్వీనర్‌గా బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది.

ఇతర ఆలయాల అభివృద్ధికి..

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయానికి రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో నదీ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

గత ప్రభుత్వం కేవలం కార్తీకమాసంలో పౌర్ణమి రోజున మాత్రమే తుంగభద్ర నదికి ‘నదీ హారతి’ కార్యక్రమాన్ని చేపట్టేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్తీక పౌర్ణమితోపాటు కార్తీక సోమవారాల్లోనూ నదీహారతి కార్యక్రమాన్ని నిర్వ హిస్తోంది. రాష్ర్టం లో ప్రముఖ క్షేత్రాలైన బాసర, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతున్నది. రానున్న రోజుల్లో ఆయా ఆలయా ల అభివృద్ధికి చర్యలను తీసుకుంటుంది.

దేవాలయ భూముల రక్షణ 

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ఆలయాలకు చెందిన భూములను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూర్ మం డలంలోని అనంతారం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 16 ఎకరాల 29 గుంటల అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి చెందిన 5 ఎకరాల 3 గుంటల అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కడ్తాల్‌లోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి సర్వే నెంబర్లు 120, 125, 130 లలో 26 ఎకరాల 21 గుంటలలో విస్తరించిన ప్రధాన రహదారుల వైపు ఉన్న దేవాలయ భూములకు ఫెన్సింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది.