30-04-2025 10:43:17 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన వనపర్తి వర్కింగ్ జర్నలిస్టులు...
వెంటనే స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి హామీ ఇచ్చిన మంత్రి..
ఆలోపు జిల్లా కేంద్రంలో తాత్కాలిక భవనం కేటాయించాలని వినతిపత్రం..
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాగా అవతరించినప్పటి నుంచి జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ లేదని, వెంటనే స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి ప్రెస్ ఫౌండర్ కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. బుధవారం వనపర్తి జిల్లాలో మంత్రి పర్యటించిన సందర్భంగా కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల వినతిని పరిశీలించిన మంత్రి వెనువెంటనే స్థలం కేటాయించడంతో పాటు, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మంత్రితో మాట్లాడుతూ... గతంలో వనపర్తిలో గ్రంథాలయం పైన ప్రెస్ క్లబ్ కు వసతి ఉండేదని కాలక్రమంలో గ్రంథాలయానికి ఆ భవనం సరిపోకపోవడంతో జర్నలిస్టులు ఆ చిన్న వసతిని కూడా వదులుకున్నారని తెలిపారు. పలు మండలాల్లో ప్రెస్ క్లబ్ లకు స్థలాలు ఉన్నప్పటికీ, కేవలం జిల్లా కేంద్రంలో స్థలం లేకపోవడంతో ఒక వేదిక లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొత్తగా స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసే లోపు జిల్లా కేంద్రంలోని ఏదైనా ప్రభుత్వ భవనం లేదా తాత్కాలిక భవనంలో తమకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
పక్కనే ఉన్న వనపర్తి శాసనసభ్యులు తోడు మెగా రెడ్డి స్పందించి తాత్కాలిక వసతి ఏర్పాటు బాధ్యత తాను తీసుకుంటానని శాశ్వత భవనం కోసం వీలైనంత తొందరగా స్థలం కేటాయింపు తో పాటు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి వనపర్తి వర్కింగ్ జర్నలిస్టులో కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ ఫౌండర్ కమిటీ అధ్యక్షుడు బలమోని రమేష్, ప్రధాన కార్యదర్శి మాకం జాని, కార్యవర్గ సభ్యులు నోముల రవీందర్ రెడ్డి, శ్రీధర్ రావు, సీనియర్ జర్నలిస్టులు కొండన్న యాదవ్, భాస్కర్, వెంకట్ గౌడ్, శ్రీనివాసరావు, ఖలీల్, దినేష్, కుమార్, శ్రీనాథ్, తరుణ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.